హామీలు గాలికి..

సభలో మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి – చింతపల్లి, నర్సీపట్నం టౌన్‌ విలేకరులు ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని, మరోవైపు కేంద్ర బిజెపి ఎపి ప్రజలకు అన్నింటా మోసం చేసిందని ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల విమర్శించారు. అల్లూరి జిల్లా చింతపల్లిలోనూ, అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడి గ్రామంలోనూ శనివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల జరిగిన సభల్లో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించారు. జగన్‌ జాబ్‌ క్యాలెండర్‌ పేరిట నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఎపికి ప్రత్యేక హోదా తీసుకురాకుండా ఈ ఐదేళ్లు ఎంపీలు గాడిదలు కాసారా ? అని ఆంధ్ర పార్లమెంట్‌ సభ్యులను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయలేదన్నారు. మద్యం లేకుండా చేసి ఓట్లు అడుగుతామన్న జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కారే నేడు మద్యం అమ్ముతోందన్నారు. రాష్ట్రంలో అమ్ముతున్న బ్రాండ్లు తాగి 25 శాతం మంది లివర్‌ చెడిపోయి చనిపోతున్నారని ఆరోపించారు. తన పుట్టింటికి అన్యాయం జరుగుతోందని భావించి ఎపిలో అడుగుపెట్టానన్నారు. రాష్ట్రంలో భూ కబ్జాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బిజెపికి లొంగిపోయాయని అన్నారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా ఎపిలో బిజెపి రాజ్యమేలుతోందని తెలిపారు. టిడిపి, వైసిపిలతో బిజెపి ట్రయాంగిల్‌ లవ్‌ స్టొరీ నడుపుతోందన్నారు. ఎన్నికల్లో రాజకీయ నాయకులు పంచే డబ్బు ప్రజలదే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తును కోరుకునే వారంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు. ఆయా సభల్లో మాజీ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు జెడి శీలం, ఎం.పల్లంరాజు, పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్‌, పిసిసి రాష్ట్ర కార్యదర్శి రుత్తల శ్రీరామ్మూర్తి, సీనియర్‌ నాయకులు మీసాల సుబ్బన్న, వేగి దివాకర్‌, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం షర్మిల సభలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. చింతపల్లిలో జరిగిన సభకు సుమారు 5 వేల మంది గిరిజనులు తరలివచ్చారు. అక్కడ సభలోనే రాష్ట్రంలో పోటీ చేసే తొలి కాంగ్రెస్‌ అభ్యర్థిని షర్మిల ప్రకటించారు. పాడేరు అభ్యర్థిగా వంతల సుబ్బారావు పేరును ప్రకటించి కార్యకర్తల్లో ఆమె ఉత్సాహం నింపారు. అల్లూరి సీతారామరాజు గురించి పదేపదే చెబుతూ ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబుపాడేరు నియోజకవర్గంలో వైసిపికి గట్టి షాక్‌ తగిలింది. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీకి విధేయునిగా ఉంటూ వచ్చిన ప్రస్తుత ట్రైకార్‌ ఛైర్మన్‌ శతక బుల్లిబాబు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో గిడ్డి ఈశ్వరి, 2019 ఎన్నికలలో కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందేందుకు బుల్లిబాబు కృషి చేశారు. 2024లో తనకు టిక్కెట్‌ వస్తుందని ఆయన ఆశించారు. నెరవేరే ఆశ కనిపించకపోవడంతో 70 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.

➡️