ప్రజాశక్తి- అరకులోయ :అధికారులు బాధ్యతా యుతంగా వ్యవహరించి ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న ప్రధానమంత్రి జన జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ అధికారులను ఆదేశించారు. జన్ మన్ కార్యక్రమం ఏర్పాట్లపై కొత్త భల్లుగుడ బాలికలు ఆశ్రమ పాఠశాలలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి పివిటిజి కుటుంబానికి గృహ నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు, జల్ జీవన్ మిషన్లో ఇంటింటికి కుళాయిలు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. 40 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారందరికీ సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అర్హులందరికీ ఆర్‌ఓ ఎఫ్‌ఆర్ పట్టాలు, పీఎం కిసాన్, రైతు భరోసా అందించాలన్నారు.జాబ్ కార్డు లేని కుటుంబాలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ముందుగా కొత్త భల్లు గుడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వేంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కె.వేణుగోపాల్, డివిజనల్ పంచాయతీ అధికారి పిఎస్. కుమార్, పంచాయతీరాజ్ ఈఈ టి.కొండయ్య పడాల్, తహశీల్దార్ వేణు, ఎంపిడిఓ వెంకటేష్ పాల్గొన్నారు.
