గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి ప్రకటించాల్సిందే

చింతూరులో వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి పాడేరు : ఆదివాసీ డీఎస్సీనోటిఫికేషన్‌ విడుదల చేయాలని, జీవో నెంబర్‌ 3 చట్టబద్ధతకై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చలో పాడేరు కలెక్టరేట్‌ సోమవారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి కలెక్టరేట్‌ వరకు గిరిజన నిరుద్యోగులు భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టర్‌ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌, ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ కన్వీనర్‌ నరేష్‌, కో కన్వీనర్‌ నారాయణరాజు మాట్లాడుతూ, ప్రస్తుత డిఎస్‌సిలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందన్నారు. పాడేరు ఐటిడిఏ పరిధిలోని డిఎస్సీ నోటిఫికేషన్లో 136 ఉపాధ్యాయ పోస్టులు కేటాయిస్తే.. ఆదివాసీలకు కేవలం 7 పోస్టులు మాత్రమే కేటాయించడం అత్యంత దుర్మార్గమని ధ్వజమెత్తారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ 3కు చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్‌ తీసుకు రావాలని, ఏజెన్సీలో 100శాతం ఉద్యోగాలు ఆదివాసులకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు జీఓ 3లో మౌలిక హక్కులు ఉద్యోగ రిజర్వేషన్‌ కొనసాగించే విధంగా 5వ షెడ్యూల్డ్‌ క్లాజ్‌ (2) ప్రకారం రూపొందించిన నూతన రెగ్యులేషన్‌ ముసాయిదాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సలహా మండలి (టిఎసి) 2021 లోనే ఆమోదించిందని, 371(డి) కింద రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం మరో సవరణ ముసాయిదా రూపొందించిందన్నారు. తక్షణమే అదివాసీ స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ పై ఆర్డినెన్స్‌ జారీ చేయక పోతే ఈనెల 10న రాష్ట్ర మన్యం బంద్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆదివాసి మాతృభాష వాలంటీర్లను రెన్యువల్‌ చేయాలని, మినిమం స్కేల్‌ అమలు చేయాలని ఈ సందర్భంగా అధికారులను డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ఆదివాసి మహిళా సంఘం జిల్లా కార్యదర్శి హైమావతి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు శాంతి కుమారి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు ఎస్‌.ధర్మన్న పడాల్‌, నాయకులు బుచ్చిబాబు, ఎంఎం శ్రీను, చిట్టిబాబు, మాతృభాష ఉపాధ్యాయుల సంఘం నాయకులు చిట్టిబాబు, కుమారి, శ్రీను, చంద్రయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జీవన్‌, కార్తీక్‌, సింహాద్రి, ఏజెన్సీ ప్రత్యేక డిఎసి సాధన కమిటీ కో కన్వీనర్లు, సర్పంచ్‌ ఉపేంద్ర, బొంజిబాబు పాల్గొన్నారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, టిడిపి మాజీ ఎమ్మెల్యేలు సంఘీభావంప్రజాశక్తి రంపచోడవరం : జీవో నెంబర్‌ 3ని పునరుద్ధరణ చేసి చట్టబద్ధత కల్పించాలని, ఆదివాసీ ప్రాంతంలోని అన్ని ఉద్యోగాలు ఆదివాసీలతోనే భర్తీ చేయాలని, 1917, 1/59, 1/70 భూ బదలాయింపు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఐటీడీఏ ఎదుట గిరిజనులు సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే వాహనాన్ని అడ్డుకొని ఆయనకు తమ నిరసనను తెలియజేసి వినతిపత్రం అందజేశారు. వీరి ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక డిఎస్‌సిని ప్రకటించాలని, జిఒ నెంబర్‌ 3ని పునరుద్ధంచాలని ఈ నెల 10వ తేదీన జరుగు ఏజెన్సీ బంద్‌కు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు, ఆదివాసీ సంఘాల నాయకులు కంగల శ్రీనివాస్‌, కడపల రాంబాబు, కత్తుల ఆదిరెడ్డి, మంగిరెడ్డి, బాండ్ల వరప్రసాద్‌, కృష్ణారావు, కొండ్ల ఆదిరెడ్డి, కరుణ విలాస్‌, బి.కృష్ణ, కె.రాంబాబు, కథల లచ్చిరెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.చింతూరు : ఎపి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చింతూరు ఐటిడిఏ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు పూనెం ప్రదీప్‌ కుమార్‌, వేక రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జనరల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌లో గిరిజన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అనంతరం ఆందోళన కార్యక్రమం వద్దకు ఐటిడిఎ పిఒ కావూరి చైతన్య రాగా, ఆయనకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాండ్రు నాగార్జున, బాబు బోరయ్య, కారం బాబురావు, పాండ్రం లక్ష్మణరావు, మీనా, దిలీప్‌, లక్ష్మణ్‌, రాజయ్య, సుందరయ్య, కోటి, రామయ్య. తదితరులు పాల్గొన్నారు.

➡️