ప్రజాశక్తి -అరకులోయ రూరల్:ఈ నెల 10 న జరిగే మన్యం బంద్ ను విజయవంతం చేయాలని శుక్రవారం ఆదివాసీ గిరిజన సంఘం అధ్వర్యంలో మండల కేంద్రం, డుంబ్రిగుడ మండలం అరకు సంతలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి బాలదేవ్ మాట్లాడుతూ, జీవో 3ను పునరుద్ధరణ చేసి గిరిజనులకు 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేయాలన్నారు. పోస్టులు లేని డీఎస్సీ ఎవరి కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని ప్రశ్నించారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి శిక్షణ పొంది ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో డీఎస్సీలో పోస్టులు లేకపోవడంతో నిరుద్యోగులు ఆవేదన చెందారన్నారు. ఈ కార్యక్రమంలో గసభ మాజీ సర్పంచ్ పి,సురేష్, సంఘం మండల అధ్యక్షులు జి బుజ్జి బాబు, సత్యనారాయణ, కోగేష్ కె.మగ్గన్న, డొంబు, తదితరులు పాల్గొన్నారు. హుకుంపేట:మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివాసి గిరిజన సంఘం మండల నేతలు ప్రచారం చేపట్టారు. జీవో 3 చట్టబద్ధతకు రాష్ట్ర ప్రభుత్వ వెంటనే ఆర్డినెస్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. . ఆదివాసీ ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్‌సి నోటిఫికేషన్‌లో నిరుద్యోగులకు అన్యాయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగమూర్తి, నరసింహమూర్తి పాల్గొన్నారు.
