ఉపాధి కూలీలకు కూలి రూ.600 చెల్లించాలి

Jun 9,2024 00:00
నినాదాలు చేస్తున్న ఉపాధి హామీ కూలీలు

ప్రజాశక్తి- అరకు లోయ: ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజు కూలి రూ.600 ఇవ్వాలని సిఐటియు మండల కార్యదర్శి జన్ని భగత్‌ రామ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలోని దుమ్మగూడ గ్రామంలోని ఉపాధి హామీ పని ప్రదేశంలో సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మండుటెండలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం రోజు కు రూ.300 కూలి ఇస్తున్నామని చెపుతున్నా అది అమలు కాలేదన్నారు. కూలి తక్కువ పని ఎక్కువగా ఉండడంతో గిట్టుబాటు కాక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో పే స్లిప్పుÛలు ఇచ్చే వారని, ప్రస్తుతం ఇవ్వలేదన్నారు. ఎండవేడికి ప్రభుత్వం ఉపాధి కూలీలకు టెంట్లు ఏర్పాటు చేసి మజ్జిగ మంచినీరు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 30 శాతం వేసవి అలవెన్స్‌ ఇచ్చి ఆదుకోవాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి పనిచేసిన కూలీలకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కిట్టు అందుబాటులో ఉంచాలని కోరారు.

➡️