రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Mar 27,2025 00:14

ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని కొట్నాపల్లి జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి చెందిన ఘటన అందరిని కలచి వేసింది. భార్యాభర్తలు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలంలో మనువాడికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి స్థానికుల వివరాల ప్రకారం…. డుంబ్రిగూడ మండలం పాముల పుట్ట గ్రామానికి చెందిన గెమ్మెలినూకరాజు, ధసుద, దంపతులు మనవడు అభిషేక్‌తో కలిసి కోట్నాపల్లి చర్చిలో ప్రార్థనకు వెళ్లి తమ గ్రామానికి వస్తున్నారు. అరకు నుండి చింతపల్లి వెళుతున్న ట్రాలీ, జాతీయ రహదారికి చెందిన వాహనం ద్విచక్రవాహనాన్ని ఢ కొట్టడంతో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. వారితో ప్రయాణిస్తున్న మనవడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుకుంపేట పోలీస్‌ స్టేషన్‌కి సమాచారం అందించారు. ఎస్సై ఎల్‌.సురేష్‌ మృతదేహాలను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న దంపతుల బంధువులు బుధవారం మధ్యాహ్నం హుకుంపేట పోలీస్‌ స్టేషన్‌ రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనకు కారణమైన హైవే అధికారుల ఫై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గాయపడిన మనవడు అభిషేక్‌కి మెరుగైన వైద్యం అందించాలని లేకపోతే మృతదేహాలను తమ గ్రామానికి తీసుకు వెళ్లలేమని బైఠాయించారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్సై సురేష్‌ జాతీయ రహదారి అధికారులతో మాట్లాడారు.తీవ్రంగా గాయపడిన బాలుడుకి చికిత్స నిమిత్తము 10 లక్షలు ఇస్తామని జాతీయ రహదారి అధికారులు ఒప్పు కోవడంతో బంధువులు మృతదేహాలను తమ గ్రామానికి తరలించారు.రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి : సిపిఎం నేతల ర్యాలీ హుకుంపేట: జాతీయ రహదారిపై మృతి చెందిన దంపతుల కుటుంబ సభ్యులకు 50లక్షల నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే పనులు అడ్డుకుంటామని సి.పి.ఏం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స హెచ్చరించారు. మండల కేంద్రంలో నుండి పోలీస్‌ స్టేషన్‌ బజార్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీని సిపిఎం నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనరస మాట్లాడుతూ, ఎస్‌ఆర్‌సి కంపెనీ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భద్రత చర్యలు తీసుకోవడంలో బాధ్యతా రహితంగానూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రహదారి పనుల సందర్భంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆదివాసుల పట్ల చులకన భావంతో వ్యవహరించడం సరి కాదని హెచ్చరించారు. మృతి చెందిన నూకరాజు కుటుంబానికి 50 లక్షలు రూపాయలు ఇవ్వాలని పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులు ఆందోళన చేపడుతున్నా ఎస్‌ ఆర్‌ సి కంపెనీ యాజమాన్యం ప్రత్యక్షంగా రాకుండా పోలీసులతో రాయబారం చేస్తూ కాలయాపన చేసిందన్నారు. చివరికి దిగివచ్చిన కంపెనీ యాజమాన్యం 10 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇస్తూ పోలీస్‌ల సమక్షంలో ఒప్పుకున్నారు.జాతీయ రహదారి పనుల సందర్భంగా భద్రతపరమైన చర్యలు తీసుకోకుండా ప్రమాదం జరిగినప్పుడల్లా చేతులు తెలుపుకుంటూ స్థానిక ప్రజలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోడానికి ఆదివాసి ప్రజానీకం సిద్ధంగా లేరని తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఎస్‌ ఆర్‌ సి కంపెనీపై ఎస్సీ, ఎస్టి ఆట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, గిరిజనులు డిమాండ్‌ చేశారు. సీపీఎం డుంబ్రిగూడ మండల కార్యదర్శి పోతురాజు, గసభ మాజీ సర్పంచ్‌ పాంగి సురేష్‌ బాబు మాట్లాడుతూ, నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదాలకు ఎస్‌ఆర్‌సి కంపెని కారణమవుతుందన్నారు. వీటిపై బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తే కంపెణీ యజమానులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. జిల్లా అదనపు ఎస్పీ స్పందిస్తూ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌ హైమావతి, కుటుంబ సభ్యులు, కితలంగి సర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️