ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండల కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న 516 ఈ జాతీయ రహదారి అంత్రిగుడ మలుపు ప్రమాదకరంగా మారింది. ఇక్కడ తరచుగా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. చాపరాయి జలపాతంకు తరచుగా వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతుండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం సమీపంలో ఉండటంతో పాటు అరుకు, పాడేరు జిల్లా కేంద్రానికి ఈ రోడ్డు ప్రధాన రోడ్డు కావడంతో ఈ రోడ్డు గుండా నిత్యం వాహనాలు అధిక సంఖ్యలో ప్రయాణాలు సాగిస్తున్నాయి. వాహనాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
