ప్రజాశక్తి -అనంతగిరి:కళాశాలలు, ఆశ్రమోన్నత పాఠశాలలో మౌలిక వసతి సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ విమర్శించారు. సోమవారం స్థానిక జూనియర్ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ బృందం సందర్శించింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కళాశాల వసతి భవనం మరుగుదొడ్లు, వాటర్ వంటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు నేతల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ అశోక్, అల్లూరి జిల్లా కార్యదర్శి పి.జీవన్‌కృష్ణలు మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలలకు 25 గదులతో కూడిన భవనాలు ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ చాలీసాలని గదులతో విద్యా బోధన కొనసాగుంచడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనంతగిరి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్ వసతి భవనలు లేక అద్దె చెల్లించుకుంటూ 200 మంది పైగా విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 సంవత్సరంలో హాస్టల్ వసతి భవనం ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా అధికారులు పనులను మొదలుపెట్టి పునాది దశలో వదిలివేసారన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే కూటమి ప్రభుత్వం నిధులను మంజూరు చేసి విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ భవనాలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.కళాశాల చుట్టూ పరహరి గోడ తో పాటు రన్నింగ్ వాటర్ వంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటానికి ముందుకు రావాలని విద్యార్థులకు సూచించారు. అరకు డిగ్రీ కళాశాలలో అధ్యాపకులను విద్యార్థులు ఆందోళన చేపట్టగా ప్రభుత్వం స్పందించి నియమించిందని గుర్తు చేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లూరు జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శులు కె, కార్తీక్ శ్రీను, మండల కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ మున్న, తేజ, సెక్రటరీ లు కళ్యాణి, కె.కృపరాజులు ఎన్నికయ్యారు.