జాలీగా..హాలిడే..

Dec 9,2024 00:28
చాపరాయి వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు

.ప్రజాశక్తి-అరకులోయ:పర్యాటక కేంద్రమైన అరకులోయకు ఆదివారం పర్యాటకులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఈ ప్రాంతంలోని సందర్శిత ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడాయి. .ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అరకులోయ ప్రాంతంలోని సందర్శిత ప్రాంతాలైన గిరిజన మ్యూజియం, ఉద్యానవన కేంద్రం, కాఫీ మ్యూజియం వంటి సందర్శిత ప్రాంతాలు కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి రావడంతో అరకులోయ టౌన్‌ షిప్‌లో సందడి నెలకొంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడ్డాయి. పోలీసులు ప్రధాన కూడలిలో విధులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయడంతో ప్రయాణికులు, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న హౌటల్స్‌లో పార్కింగ్‌ సదుపాయం లేక పోవడంతో పర్యాటకుల వాహనాలన్నీ రోడ్డుపైనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుంది. మునుపెన్నడూ లేని విధంగా లెక్కలేని వాహనాలు, ద్విచక్ర వాహనాల్లో పర్యాటకులు తరలిరావడంతో రద్దీ ఏర్పడింది. మద్యం దుకాణాలన్నీ రోడ్డుపైనే ఉండడంతో మందు బాబుల వాహనాలన్నీ రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. బ్రాందీ షాపులు ఊరికి చివర్లో ఉంటే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు డిమాండ్‌ చేస్తున్నారు. పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆయా సందర్శిత ప్రాంతాల్లో ప్రవేశ రుసుం ద్వారా లక్షల్లో ఆదాయం సమకూరింది. పర్యాటకులు ఎక్కువమంది తరలి రావడంతో స్థానిక వర్తకులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. హౌటల్‌, లాడ్జిలు, క్యాంపింగ్‌ టెంట్లు, రిసార్ట్స్‌లు కిటకిట లాడాయి. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో రోడ్లు దాటడానికి పాత చారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.చాపరాయిలో పర్యాటకుల తాకిడిడుంబ్రిగుడ:ప్రముఖ పర్యాటన కేంద్రమైన మండలంలోని చాపరాయి జలపాతంలో ఆదివారం అధిక సంఖ్యలో మైదాన ప్రాంతం నుంచి పర్యాటకులు తరలివచ్చారు. పర్యాటకుల తాకిడితో చాపరాయి జలపాతం కిటకిటలాడింది. ఇక్కడ సందర్శించిన తిలకత పర్యాటకులు చాపరాయి జలపాతంలో చిన్న పెద్ద తేడా లేకుండా సరదాగా జారుకుంటూ స్థానాలు చేస్తూ కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు. గిరిజన సాంప్రదాయమైన దింసా నృత్య కళాకారులతో పర్యాటకులు ప్రదర్శిస్తూ ఆనందంగా గడిపారు. జలపాతంలో స్నానాలు చేసిన తర్వాత చాపరాయి నుంచి జైపూర్‌ జంక్షన్‌ వరకు రోడ్డు కిరువైపులానున్న చెట్టు నీడలో వనభోజనాలు చేస్తూ కుటుంబ సమేతంగా ఆటపాటలతో సందడి చేస్తూ ఆనందంగా గడిపారు. చాపరాయి జైపూర్‌ జంక్షన్‌కు మధ్యలో పంతల చింత, జంగిడి వలస రైల్వే గేట్‌ సమీపంలో నున్న పొద్దుతిరుగుడు పూల తోటలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. దీంతో ఆ పూల తోటల వద్ద పర్యాటకులు ఫోటోలు తీయించుకుంటూ సందడి చేశారు. జి.మాడుగుల: మండలంలో కొత్తపల్లి వాటర్‌ జలపాతం ఆదివారం పర్యాటకలతో కిటకిట లాడింది. మైదాన ప్రాంతం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున పర్యాటకులు తరలి వచ్చారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వాటర్‌ ఫాల్స్‌లో జలకాలాడుతూ కేరింతల కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు

➡️