షెడ్యూల్డ్‌ ఏరియా ఉద్యోగ నియామక చట్టం చేయాలి

మాట్లాడుతున్న అప్పలనర్స

ప్రజాశక్తి డుంబ్రిడ: అసెంబ్లీ సమావేశాలలో చర్చించి షెడ్యూల్డ్‌ ఏరియా ఉద్యోగ నియామక చట్టం చేయాలని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనరస డిమాండ్‌ చేశారు. స్థానిక మండల కేంద్రంలోని కమ్యూనిటీ భవనంలో గురువారం ఆ పార్టీ మండల మహాసభ జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మెగా డీఎస్సీ తోపాటు స్పెషల్‌ డిఎస్సి కలిపి నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. వంద శాతం రిజర్వేషన్‌ కల్పించిన జీవో 3ను పునరుద్ధరిస్తానంటూ ఎన్నికల ముందు అరకులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. అధికారం చేపట్టి నాలుగైదు క్యాబినెట్‌ సమావేశాలు జరిగినా చర్చ కూడా జరపలేదని విమర్శించారు. షెడ్యూల్డ్‌ ఏరియా ఉద్యోగ నియామక చట్టంపై చర్చించి చట్టం చేసిన తర్వాత మెగా డీఎస్సీ ,స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నారు. పి వి టి జి గిరిజనులకు మంజూరు చేసిన పీఎం జన్మన్‌ గృహ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఈనెల 8 నుంచి 14 వరకు ప్రజా పోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, చివరి 14 రోజున అన్ని మండల కేంద్రంలో నిరసన ప్రదర్శనలు చేయడం జరుగుతుందన్నారు. ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని చెబుతున్నా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడా అమలు కాలేదన్నారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేపడుతున్నారని విమర్శించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేసే విధంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో భారాన్ని ప్రజలపై మోపారన్నారు. మండలంలోని పెదపాడు, శీలం గొంది గడ్డల్లో వెంటనే వంతెనలు నిర్మించాలని చెప్పారు. శీలం గొంది వంతెన 2014లో కురిసిన హుదూద్‌ తుఫాన్‌ కు కొట్టుకుపోయిన ఇప్పటికి ఎటువంటి పునర్నిర్మాణ పనులు చేపట్టలేదని చెప్పారు. పెదపాడు ప్రాంత గిరిజనులకు చాపరాయి జలపాతం గెడ్డ వద్ద వంతెన నిర్మించాలని వంతెన లేక ఆ ప్రాంత గిరిజనులు రవాణా సౌకర్యానికి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నార న్నారు. వచ్చేనెల 2 నుంచి 4 వరకు పాడేరులో సిపిఎం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని.2, 3 న ఆదివాసి గిరిజన సంప్రదాయ కళ నృత్యాలను ప్రదర్శించి 4న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. దీనికి ముందు పార్టీ జెండాను మండల సీనియర్‌ నాయకుడు పి మత్తు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఎస్‌బి పోతురాజు, నాయకులు పి.సురేష్‌కుమార్‌, టి.సూర్యనారాయణ, పి.సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️