డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళి 

ప్రజాశక్తి-విఆర్ పురం: అంబేద్కర్ కి జయంతి సందర్భంగా మండలం రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ కు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కుమారుడు సిపిఎం సీనియర్ నాయకులు కుంజా నాగిరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి పులి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ దేశ అభివృద్ధికి ప్రజలకు, ప్రభుత్వాలకు ఒక దిక్సూచిగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నత వ్యక్తి, శక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. కానీ నేడు అంబేద్కర్ చూపించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అంబేద్కర్ కన్న కలలను తుడిచి పెట్టే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకిక విలువలను కాపాడుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో రాబోయే తరానికి ఒక స్ఫూర్తిని ఇవ్వడం కోసం దేశ ప్రజలంతా ఐక్యత భావాన్ని ప్రదర్శించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పంకు సత్తిబాబు, పోడియం శ్రీరామ్ మూర్తి, శ్రీరపు తాతబాబు, సోడి మల్లయ్య, రవి, సిహెచ్ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️