ప్రజాశక్తి- అనంతగిరి రూరల్, అనంతగిరి: శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని పినకోట పంచాయతీలో కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామ రహదారులన్నీ పూర్తిగా కొట్టుకుపోయి కొన్ని చోట్ల రాళ్లు తేలి ఉన్నాయి. మరికొన్ని చోట్ల గండి కొట్టుకు పోవడంతో గిరిజన గ్రామాలకు చేరుకోవాలంటే నరకయాతన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పినకోట పంచాయతీ గడ్డిబంధ చిడిమెట్ట బోనూరు గ్రామాలకు వెళ్లే రహదారిలో నిర్మిస్తున్న కల్వర్టును వరద నీటితో కొట్టుకు పోవడంతో మారుమూల 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని పినకోట పంచాయతీ వాసులు వాపోతున్నారు. ఈ సందర్భంగా పినకోట సర్పంచ్ ఎస్.గణేష్ ,పెద్దకోట మాజీ సర్పంచ్ జే.దేముడులు మాట్లాడుతూ, తమ పంచాయతీలు మండల కేంద్రానికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఇటు మండలాధికారులు, అటు ప్రభుత్వంం తమ గ్రామాల అభివృద్ధికి దృష్టి సారించలేదన్నారు. దీంతో, మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని వారు తెలిపారు. అత్యవసర సమయాల్లో కాలినడకన డోలి మోతలు మొసుకొని తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొన్ని సందర్భాల్లో కాలినడకన తీసుకువెళ్లడంతో సకాలంలో వైద్యం అందక దారిలోనే ప్రాణాలు విడిచి పెడుతున్న సందర్భాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే గడ్డిబంధ చిడిమెట్ట మధ్యలో కల్వర్టు నిర్మాణం చేపట్టాలని పలు గ్రామాలకు చెందిన గిరిజనులు డిమాండ్ చేశారు .