పాడేరు ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

Apr 13,2025 23:35

ప్రజాశక్తి- మాడుగుల: జీవనోపాధి కోసం పొట్ట చేత పట్టుకుని వలస పోతున్న కూలీలు ప్రయాణిస్తున్న బొలెరా వాహనం ప్రమాదానికి గురై 18 మంది కి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి క్షతగాత్రులు కొంతమంది అందించిన వివరాలివి. ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా కొత్తవలస, సిద్దల మామిడి, బొడ్డు గూడ, రాళ్లగెడ్డ గ్రామాలకు చెందిన 18 మంది కూలీలు తెలంగాణ రాష్ట్రంలో కూలీ పనులు చేసుకునేందుకు ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం బయలుదేరారు. ఆ బొలెరా వాహనంపై ఒరిస్సా నుంచి వస్తూ పాడేరు ఘాట్‌రోడ్డులో కోమాలమ్మ పనుకు ఏసుప్రభు మలుపు వద్ద వచ్చేసరికి అర్ధరాత్రి సమయంలో బొలెరా వాహనానికి బ్రేకులు ఫెయిల్‌ కావడంతో లోయలోకి దూసుకుపోయింది. దీంతో గాయాలు పాలైన వారంతా పెద్దగా కేకలు వేయడంతో ద్విచక్ర వాహనదారులు గమనించి మాడుగుల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు., అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని లోయలో పడి ఉన్న క్షతగాత్రులను ఒడ్డుకు తీసుకుని వచ్చారు. అగ్నిమాపక వాహనంలోకి ఎక్కించి మాడుగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు ప్రధమ చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న మామిడి అప్పారావు, గుంట కాయేస్‌, డిప్ప తిరుపతి, కొర్ర రామ్‌, గుంత లైకోన్‌, అబినాయక్‌, కొంతల్‌, గుంట జంబోలను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు.మిగిలిన గెమ్మెల శ్రీదేవి, సునీత, కొర్ర షుగంది, రాధా, షణ్ముఖుడు, రంజిత్‌, మనోజ్‌, పింగల్‌, లైమతి, లైక్‌ కొన్‌ మూర్తిలకు స్వల్ప గాయాలు కావడంతో మాడుగుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై ఎస్‌ఐ నారాయణరావుకు సంప్రదించగా పాడేరు పరిధిలో ప్రమాదం జరిగిందని, పాడేరు పోలీస్‌ స్టేషన్‌ కి సమాచారం అందించామని తెలిపారు.

➡️