విద్యా ప్రమాణాలు మెరుగు పడకుంటే చర్యలు

మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ప్రజాశక్తి- పాడేరు: విద్యార్ధుల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పడక పోతే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎ.ఎస్‌. దినేష్‌ కుమార్‌ హెచ్చరించారు. ఉపాధ్యాయుల బోధనా తీరు మారాలన్నారు. స్థానిక తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో సహాయ గిరిజన సంక్షేమాధికారులు, మండల విద్యాధికారులు బేస్లైన్‌ ఎగ్జామ్‌ దిశ కార్యక్రమం అమలుపై మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, మండల విద్యాశాఖాధికారులు పర్యవేక్షణ లోపంతోనే విద్యార్ధుల విద్యాసామర్ధ్యాలు సక్రమంగా లేవన్నారు. సహాయ గిరిజన సంక్షేమాధికారులు, ఎం.ఇ.ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి గిరిజన విద్యార్ధులకు మెరుగైన విద్యను అందించడానికి అంకితభావంతో కృషి చేయాలని చెప్పారు. విద్యార్ధులను ఎబి సిడిలు గా విభజించి సి డి గ్రూపులలో ఉన్న విద్యార్ధులపై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టాలన్నారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, విద్యాప్రమాణాలను పరిశీలించి స్టార్‌ రేటింగ్‌ ఇస్తామన్నారు. ఈనెల 29,30 తేదీలలో మార్గదర్శిని వర్కుషాపు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎల్‌.రజని, డి.ఇ. ఓ బ్రహ్మాజీ రావు, 11 మండలాల ఎటిడబ్ల్యూఓలు, నీతి ఆయోగ్‌ ప్రొగ్రాం అధికారి నారాయణ రెడ్డి రంపచోడవరం, చింతూరు డివిజన్లకు సంబంధించిన అధికారులు పర్చువల్‌ గా పాల్గొన్నారు.

➡️