అంగన్వాడీల ఆందోళన

Mar 11,2025 00:37
ఆందోళన చేస్తున అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-పాడేరు: తమకు కనీస వేతనాలు చెల్లించాలని, గ్రాట్యుటీ అమలు, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ జిఓ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సోమవారం పాడేరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పాడేరు డివిజన్లోని పలు మండలాల నుంచి అంగన్వాడి వర్కర్లు ఈ కార్యక్రమానికి కదిలి వచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు భాగ్యలక్ష్మి, కొండమ్మ మాట్లాడుతూ, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు పెట్టుబడులు పెట్టి నిర్వహిస్తున్నామన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదన్నారు. అంగన్వాడీలకి వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారంకు 42 రోజుల పాటు సమ్మె నిర్వహించామన్నారు. సమ్మె ముగింపు సందర్భంగా అంగన్వాడీలకు 2024 జూలై లో వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తమ సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేశారు. అంగన్వాడి కార్యకర్తలు సమస్యలు పరిష్కరించాలని, సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని విజయవాడలో శాంతియుతంగా మహా ధర్నా కార్యక్రమానికి తరలి వెళుతుండగా రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా పోలీసులతో భగం చేయాలని చూసిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు విమర్శించారు. అంగన్వాడీల నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కనీస వేతనం రూ.26000 చెల్లించాలని సమ్మెలో ఒప్పందాలని అమలు చేయాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంట్రల్‌గా మార్చాలని డిమాండ్‌ చేశారు.పాడేరు జిల్లా పిడి అంగన్వాడీ యూనియన్‌ నాయకులను బెదిరిస్తున్నారని తెలిపారు. పాడేరు పిడి పై శిశు సంక్షేమ కమిషనర్‌ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పిడి వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కే భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షురాలు కొండమ్మ, డుంబ్రిగూడ మండల అధ్యక్షురాలు కొండమ్మ పలు మండలాల అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, వర్కర్లు, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️