మోకాళ్లపై ఆందోళన

Feb 2,2025 23:58
మోకాళ్లపై నినాదాలు చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి – చింతపల్లి: అభివృద్ధి ముసుగులో రాజ్యాంగం కల్పించిన గిరిజన చట్టాలను నిర్వీర్యం చేసి హక్కులను కాలరాయాలని చూడడం పాలకులకు తగదని చౌడుపల్లి సర్పంచ్‌ గేమ్మేల లలిత, పంచాయతీ వార్డు సభ్యుడు కోరాబు కరుణానిధి తెలిపారు. 1/70 చట్టంపై శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ పంచాయతీ పిసా ఉపాధ్యక్షులు ఎల్‌ రాజారావు, వి.దాసు, వైకాపా సీనియర్‌ నాయకులు సాగిన గంగన్నపడాల్‌, జి సింహాచలం, అరడ గంగన్నదొర, ఆ పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం మోకాళ్ళపై నిలుచుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో ప్రత్యేకంగా 1/70 చట్టం చేసి గిరిజనులకు పలు ప్రత్యేక హక్కులు కల్పిస్తే వాటిని సంరక్షించ వలసిన పాలకులు అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. చట్టాలను సంరక్షించే అత్యున్నత స్థానంలో ఉన్న శాసన సభాపతి గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడాన్ని వారు తప్పు పట్టారు. మన్య ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చట్టాలను తొలగించవలసిన, నిర్వీర్యం చేయవలసిన అవసరం లేదని తెలిపారు. అభివృద్ధి పేరుతో తమకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను నిర్వీర్యం చేసి తమ హక్కులను కాలరాయాలని చూస్తే గిరిజనుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పంచాయతీ వైస్‌ చైర్మన్‌ రాజేష్‌, వార్డు సభ్యులు, రమణమ్మ, ధనుష్‌, పీసా కమిటీ కార్యదర్శి జి అప్పారావు, ఆ పార్టీ శ్రేణులు జి.కగుపతి, కే బాబురావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️