ఉపాధ్యాయుడ్ని నియమించరూ..

ఇదే జామగుడ పాఠశాల

.ప్రజాశక్తి -అనంతగిరి:ప్రాథమిక ప్రైమరీ పాఠశాలలో చదివే విద్యార్థులకు విద్యాబోధన అందించే ఉపాధ్యాయుడు లేక విద్య కుంటు పడుతుంది. అల్లూరి జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఈ దుస్థితి నెలకొంది. అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీ జామగుడ జీటిడబ్ల్యూ ప్రాథమిక పాఠశాలకు 2024 విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభం నుండి నేటి వరకు పర్మినెంట్‌ ఉపాధ్యాయుడు లేక విద్యార్థులకు విద్యా బోధన అందలేదు. విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆటలు ఆడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఒక సవత్సరం లాంగ్‌ లీవ్‌ పెట్టడంతో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మిగిలింది. ఈ పాఠశాలలో కమలాపురం, జామగుడ గ్రామాలకు చెందిన 31 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయుడు లేక రోజంతా ఆటలు ఆడుకోవాల్సిన పరిస్థితి ఆ విద్యార్థులకు నెలకొంది. ఇప్పటికైనా పర్మినెంట్‌ ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. భాషా వాలంటరీ ఉన్నప్పటికీ పాఠశాల నిర్వహణ కష్టంగా మారింది. ఉపాధ్యాయుడ్ని నియమించాలని మండల స్థాయి విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు వాపోయారు . మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద విద్యార్థులతో ఆందోళన కార్యక్రమం చేపడతామని తల్లిదండ్రులు హెచ్చరించారు.

➡️