పెదపాడులో సమస్యల తిష్ట

గెడ్డలోని కుండీలో నీటిని పట్టుకుంటున్న గిరిజన మహిళలు

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: పివిటిజి గ్రామాల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసి కనీస సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప ఆచరణలో ఏమాత్రం అమలు కాలేదు. దీంతో స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఆదివాసి పివిటిజి గిరిజనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉంది. ఇందుకు నిదర్శనం కొర్రా పంచాయతీ పివిటిజి పెదపాడు గ్రామమే. ఈ గ్రామంలో సుమారు 105 కుటుంబాలు ఉండగా సుమారు 500 మంది పివిటిజిలు ఉన్నారు. ఆ గ్రామంలో కనీస మౌలిక సౌకర్యాలైన సురక్షిత తాగునీరు, సిసి రోడ్లు, వీధి కాలువలు కల్పించక పోవడంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం సురక్షిత తాగునీటి సౌకర్యం లేక ఆ గ్రామంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఏర్పడింది. ఆ గ్రామస్తుల సౌకర్యార్థం వాటర్‌ షెడ్‌ గతంలో గ్రావిటీ పథకాన్ని నిర్మించారు. గత మూడేళ్ల నుంచి గ్రావిటీ మరమ్మతు గురై మూలన పడింది. దీంతో, ఆ గ్రామస్తులకు పొలాల్లోని ఊట గెడ్డ నీరే శరణ్యంగా మారింది. ఎటువంటి ఆధారం లేక తప్పని పరిస్థితిలో కలుషితమైన ఊటగెడ్డ నీటిని ఆ గ్రామస్తులు సేకరించి ఉపయోగించుకుంటూ వ్యాధుల బారిన పడి అనారోగ్యాలకు గురవుతున్నామని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించక పోవడంతో వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు, గ్రామస్తులు ఉపయోగించిన నీళ్లు, నివాసగృహాలకు ఎదురుగా నిలువ ఉండిపోతుంది. కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సిసి రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు, పలు సంఘాల నేతలు కోరుతున్నారు.

➡️