అడ్డాకులకు గిట్టుబాటు ధర ఏదీ

వ్యానులో అడ్డాకులను మైదాన ప్రాంతానికి తరలిస్తున్న వ్యాపారులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో సీజనల్‌ వారీగా గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులను జిసిసి కొనుగోలు చేయలేదు. దీంతో, మైదాన ప్రాంత వ్యాపారులు అటవీ ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు. గిరిజనులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.గిరిజనులు సేకరిస్తున్న అడ్డకులను జిసిసి కొనుగోలు చేయకపోవడంతో మైదాన ప్రాంత వ్యాపారులు, మధ్యవర్తి దళారులు కుమ్మక్కై బెట్టు కాటాలతో వారికి నచ్చిన ధరతో కొనుగోలు చేస్తూ మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. సరైన గిట్టుబాటు ధర లేక అడ్డాకులు సేకరించిన గిరిజనులు ఆర్థికంగా నష్టపోతున్నారు.గతంలో అడ్డాకులను జిసిసి కొనుగోలు చేసేది. దీంతో అడ్డాకులు సేకరించిన గిరిజనులకు గిట్టుబాటు ధర వచ్చేది. అయితే గత కొన్నేళ్ల నుంచి జిసిసి కొనుగోలు చేయకపోవడంతో మైదాన ప్రాంత వ్యాపారులు వారపు సంతలోకి వచ్చి వారికి నచ్చిన విధంగా ధరతో కొనుగోలు చేస్తూ మైదాన ప్రాంతాలకు తరలిస్తూ లాభార్జన చేసుకుంటున్నారు. అడ్దాకులను జి సిసి కొనుగోలు చేయాలని, గిరిజనులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.వేసవికాలంలో గిరిజన ప్రాంతంలో గిరిజనులు అడ్డాకులను సేకరిస్తుం టారు. ఎటువంటి వ్యవసాయ పనులు లేని సమయంలో వేసవిలో గిరిజనులు అడ్డాకులను సేకరిస్తుంటారు. వారానికి ఆరు రోజులపాటు అడ్డాకులను అటవీ ప్రాంతంలోకెళ్లి సేకరించి, అడ్డాకులను చిన్న చిన్న కట్టలుగా కట్టి, వారం రోజులపాటు ఎండబెట్టి ఆ తర్వాత విక్రయించే సమయంలో అడ్డాకులను పెద్ద కట్టలుగా కట్టి తరలించి వారపు సంతల్లో విక్రయిస్తుంటారు. సరైన గిట్టుబాటు ధర లేక వారం రోజులపాటు కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవడంతో అడ్డాకులు సేకరించిన గిరిజనులు గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం అరుకు వారపు సంతలో 40 కేజీల పెద్ద కట్ట దిండిను రూ.600 నుంచి రూ.700 వరకు మైదాన ప్రాంత వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో వారం రోజుల పాటు కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదంటూ అడ్డాకులు సేకరించిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డాకులను జీసిసి కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో మైదాన ప్రాంత వ్యాపారులు, మధ్యవర్తి దళారులు బెట్టు కాటాలతో మోసం చేస్తూ వారికి నచ్చిన విధంగా ధరతో కొనుగోలు చేస్తూ అమాయక గిరిజనుల కష్టాన్ని దోచుకుంటున్నారు. దూర ప్రాంతం నుంచి వారపు సంతలకు తరలించడానికి లగేజ్‌ చార్జీలు కూడా అధికంగా అవుతుందని వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అడ్డాకులను జిసిసి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

➡️