ప్రత్యామ్నాయ పంటలతో గంజాయి నిర్మూలన

మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు:ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే గంజాయిని నిర్మూలించవచ్చునని జిల్లా కలెక్టర్‌ ఎ.ఎన్‌. దినేష్‌ కుమార్‌ స్పష్టం చేసారు. గంజాయి సాగుతో సమాజానికి కలిగే చేటుపై గిరిజనులను చైతన్యవంతం చేయాలని సూచించారు. కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన, ఐసిడిఎస్‌, విద్యా, పోలీస్‌, డి.ఆర్‌.డిఏ, వైద్య ఆరోగ్య, అటవీ శాఖ అధికారులతో గంజూయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై సోమవారం సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గంజాయి నిర్మూలనపై గత నెలలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో గంజాయి వినియో గంతో కలిగే నష్టాలపై అవగాహనా సదస్సులు నిర్వహించాలని సూచించారు. కళాశాలల్లో అవగాహనా సదస్సులు, డి ఎడిక్షన్‌ సెంటరుకు ఎంత మంది వచ్చారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా స్వయం సహాయ సంఘాల సమావేశాల్లో గంజాయి సాగు నిర్మూలనపై చర్చించాలని సూచించారు. గంజాయి సాగు వినియోగం, అక్రమ రవాణాపై 9381123100 ఫోన్‌ నంబరుకు ప్రజలు సమాచారం అందించాలని చెప్పారు. జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2241 మంది రైతులకు 400 టన్నుల రాజ్మా విత్తనాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. యువత గంజాయి వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 153 గ్రామాల్లో గంజాయి సాగు ఫై సర్వే చేయడం జరిగిందన్నారు. వివిద ప్రభుత్వ శాఖల్లో 34 ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేసామన్నారు. జిల్లా సరిహద్దులో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గంజాయి సాగు విడిచి పెట్టిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, స్వయం ఉపాధి పథకాలు, బ్యాంకు రుణాలు, పశువులు, మేకలను మంజూరు చేయాలని స్పష్టం చేసారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం. జె. అభిషేక్‌ గౌడ్‌, జిల్లా ఉద్యానవన అధికారి రమేష్‌ కుమార్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి ఉపసంచాలకులు ఎల్‌. రజని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జమాల్‌ భాషా, పిడిలు మురళి, సూర్యలక్ష్మి పాల్గొన్నారు.

➡️