ప్రజాశక్తి- హుకుంపేట: మండలంలో జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా అండిబ పంచాయతి పివిటిజి గ్రామం నక్కగొయ్యి సందర్శించారు. నక్కగొయ్యిలో గ్రామస్తులు ఆప్యాయంగా మంగల హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిఎం జన్మన్ కింద మంజూరైన గృహాలపై ఆరా తీసిన కలెక్టర్ ఇంకా పదిమందికి గృహాలు అవసరమని గుర్తించారు. గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని డిఇఇ రాజబాబును ఆదేశించారు. అండిబ నుండి ఎగువమోదపుట్టు గ్రామానికి ఆరు కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు తమకు పించన్లు అందటం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా కొంతమంది అధిక విధ్యుత్ వినియోగం, భూముల మ్యుటేషన్ వంటి సమస్యలున్నందున మంజూరు కాలేదని అధికారులు వివరించారు. కలెక్టర్ స్పందిస్తూ ఆయా ఫిర్యాదులను పూర్తి స్థాయిలో విచారించి తదుపరి చర్య నిమిత్తం నివేదిక సమర్పించాలని ఆదేశించారు. భీమవరం పంచాయతిలో విడివికె కేంద్రానికి చేరుకొని చీపుర్ల తయారీని పరిశీలించి వారి ఆదాయం గూర్చి ఆరా తీసారు. చీపుర్లకు ఒక బ్రాండ్ పెడితే మంచి ధర లభిస్తుందన్నారు. అవసరమైతే మార్కెట్ సదుపాయం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలతో కాసేపు ముచ్చటించారు. అక్కడినుండి గుమ్మడిగుండువ పివిటిజీ గ్రామం చేరుకోగా గ్రామస్తులు రహదారి మంజూరుకు విజ్ఞప్తి చేసారు. పివిటిజీ గ్రామానికి పిఎం జన్మన్ కింద రహదారి మంజూరు చేయడం జరుగుతుందని హామీ ఇస్తూ 11 మండలాల ఫరిధిలో ఇలాంటి గ్రామాలను గుర్తించి నివేదిక అందజేయాలని డిఇఇ ధృవకుమార్ ను ఆదేశించారు.పెదగరువు గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించి పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లు పరిశీలించారు. మరుగుదొడ్లలో సానిటరీ నేప్కిన్స్ పడివుండటాన్ని గుర్తించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్త పరుస్తూ వాటి డిస్పోజల్ కు ప్రత్యెక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా మాష్టారి అవతారమెత్తిన కలెక్టర్ విద్యార్ధులతో లెక్కలు చేయించారు. బూర్జ పంచాయతి కొండయ్యపాడు, పటకదౌడ గ్రామాలలో పర్యటించి గ్రామస్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు వారి గ్రామాలకు మంజూరైన జిఎస్బి, మెటల్ రోడ్ల స్థానంలో బిటి రోడ్డు మంజూరు చేయాలని కోరగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. బూర్జ నుండి సొంటారిపాడు మీదుగా దిగసల్తంగి గ్రామానికి ఆరు కిలో మీటర్ల ్ద రహదారి నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, సిడిపిఓ సిహెచ్ బాలమణి దేవి, వెలుగు ఏపీఎం అప్పాయమ్మ పాల్గొన్నారు.