స్టేట్‌ బ్యాంకు ఖాతాదారుల ఆందోళన

నినాదాలు చేస్తున్న ఖాతాదారులు, సిపిఎం నేతలు

ప్రజాశక్తి అరకులోయ రూరల్‌: అరకులోయ స్టేట్‌ బ్యాంకులో సిబ్బంది లేక గత మూడు రోజుల నుండి సేవలు అందక పోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి కె రామారావు అన్నారు. బుధవారం అరకులోయ స్టేట్‌ బ్యాంక్‌ వద్ద బ్యాంక్‌ ఖాతాదారులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్యాంకులో పూర్తిస్థాయిలో సిబ్బంది లేక కేవైసీ, ఫోన్‌ నెంబర్‌ లింక్‌, జీరో అకౌంట్‌, ఇన్‌యాక్టివ్‌ అకౌంట్లు తదితర సేవలు అందించే సిబ్బంది లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నట్లు తెలిపారు.మూడు రోజులుగా వినియోగదారులు తమ వ్యవసాయ కూలీ పనులను విడిచిపెట్టి బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా స్టేట్‌ బ్యాంకులో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.ఒకే కౌంటర్లో అన్ని రకాల పనులు చేస్తుండడంతో వినియోగదారులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడవలసిన వస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి గత్తుం బుజ్జిబాబు, కుమ్మిడి రమేష్‌, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

➡️