ప్రజాశక్తి- అరకులోయ:అరకులోయలో గత వారం రోజుల నుండి తాగునీరు సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలాదేవ్ తెలిపారు. సరభగుడ హౌసింగ్ కాలనీలో గ్రామస్థులతో కలిసి మరమత్తుకు గురైన బోరింగ్, కుళాయి వద్ద ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, పెదలబుడు పంచాయితీ అరకులోయ పట్టణంతో పాటు, సరభగుడ, జడ్పీకాలనీ, సీ.కాలని, బి.కాలనీ, రెంటల్ హౌసింగ్ కాలనీ, కొండవీధి, ఆదివాసీ కాలనీ, సరభగుడ హౌసింగ్ కాలనీ, ఆసుపత్రి కాలనీ తదితర ప్రాంతాల్లో వారం రోజుల నుండి మంచి నీరు సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మంచినీటి సమస్యను తీర్చాలన్నారు.ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయితీ అధికారులు మరమ్మతుల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, శాశ్వత పరిష్కారం చేయ లేదన్నారు.ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని అరకులోయ పట్టణంతో పాటు గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.కార్యక్రమంలో సరభగుడ హౌసింగ్ కాలని గ్రామస్తులు మాదాల కాసులమ్మ, కొర్రా రాజేశ్వరి, పి.మణి కిల్లో కుమారి,మల్లేశ్వరి కిల్లో రాజు, అజరు, కొర్రా వెంకటరావు, మాదాల నినిబుడ్డి,బురిడి డొమిని, వంతాల విజరు రాజు పాల్గొన్నారు.డుంబ్రిగుడ: మండలంలోని రంగిలిసింగి పంచాయతీ వాకపల్లి గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆ గ్రామస్తులు స్థానిక సిపిఎం ఆధ్వర్యంలో గుంటసీమ సచివాలయ కేంద్రం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. సచివాలయ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆ పార్టీ మండల నాయకుడు పి డొంబు మాట్లాడుతూ వాకపల్లి గ్రామంలో తాగునీటి సౌకర్యంకు గత ఏడాది జల జీవన్ పథకం ద్వారా గ్రావిటీ పథకం మంజూరైనా అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలో ఇప్పటివరకు నిర్మించలేదన్నారు. దీంతో ఆ గ్రామస్తులు సమీపంలోని పొలంలోని నీటిని సేకరించి ఉపయోగిస్తూ పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కలుషిత నీటిని ఉపయోగించడంతో ఆ గ్రామస్తులు మలేరియా, టైఫాయిడ్ వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో గ్రావిటీ పథకం నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాందాస్ పొద్దు, జిన్ను, కృష్ణారావు, బాలదేవు, గ్రామస్తులు పాల్గొన్నారు.
