కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

పాడేరులో ఆందోళన చేస్తున్న నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి -పాడేరు: కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌, డైలీ వేజ్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో పాడేరు కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అంతకుముందు ఐటిడిఏ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌, డైలీ వేజ్‌, క్యాజువల్‌ కార్మికులు అగ్రిమెంట్‌, అప్రెంటిస్‌ పేరుతో వేలాదిమంది పని చేస్తున్నారని తెలిపారు. వీరంతా ఎక్కువ కష్టం తక్కువ జీతం పొందే కార్మికులని పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ, గురుకులాలు, కాఫీ లైజన్‌ వర్కర్స్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, విద్యా శాఖ, సమగ్ర శిక్ష, విద్యుత్‌ జిసిసి హాస్పిటల్‌ తదితర వాటిలో కార్మికులు పని చేస్తున్నారన్నారు. రోజురోజుకీ మార్కెట్లో నిత్యావసర ధరలు పెరుగుతున్నా వేతనాలు పెరగ లేదని, దీంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వీరికి సెలవులు కూడా ఇవ్వరని, కార్మికులు మృతి చెందినా ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదన్నారు., రిటైర్‌ బెనిఫిట్‌ స్కీమ్స్‌, పిఎఫ్‌ ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు అమలు చేయలేదని విమర్శించారు.సమాన పనికి సమాన వేతనం అమలు చేసి, పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా నాయకులు ఎల్‌.సుందరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంటాక్ట్‌ ఉద్యోగ సంఘ నాయకులు లక్ష్మణరావు, బాలన్న, ఐటిడిఏ వర్కర్స్‌ యూనియన్‌ రాజు, హాస్టల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కొండలరావు, ఐటీడీఏ కాఫీలైజర్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు శ్రీను, హాస్పటల్‌ వర్కర్స్‌, సమగ్ర శిక్ష జేఏసీ కన్వీనర్‌ జయరాజ్‌, కేజీబీవీ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శంకర్రావు, పడాల్‌, పాల్గొన్నారు.రంపచోడవరం : రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేసి, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్‌ ఈఎస్‌ఐ పెన్షన్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు చేయాలని కోరుతూ సిఐటియు రంపచోడవరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులు సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి నాయకులు వాలంటీర్లకు రూ.10వేలు గౌరవ వేతనం ఇస్తానని, వారిని కొనసాగిస్తామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కావస్తున్న నేటికీ వాటిని అమలు చేయలేదని పేర్కొన్నారు. రంపచోడవరం, దేవీపట్నం మండలాల్లో వెలుగు వివోఏలకు 17 మందికి 17 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడినటువంటి వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌కు యూనియన్‌ ప్రతినిధి బృందం అందించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ, నాయకులు రామకృష్ణ, రవి, మల్లెరెడ్డి, జానీ, బాబురావు, మహేష్‌, వెంకట్‌, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మోతుగూడెం : చింతూరు మండలం, మోతుగూడెంలో ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్‌లోని పేని చేస్తునన కాంట్రాక్ట్‌ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, చీఫ్‌ ఇంజనీర్‌కు వినతి పత్రం అందించారు. విద్యుత్‌ సంస్థలో పనిచేసే ప్రతి కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, 2022 పిఆర్సి ప్రకారం వేతనాలు ఏరియర్స్‌ ఇవ్వాలని, 17 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను పీస్‌ రేట్‌ నుండి మ్యాన్‌ పవర్‌గా మార్చాలని, కార్మికులందరికీ హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని, ఏపీ జెన్కో ఆసుపత్రిలో కార్మికులకు వైద్య సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️