ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండలంలోని అతి మారుమూల ప్రాంతమైన లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధి మెట్టగుడలో పాఠశాల లేక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మెట్టగుడలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. గ్రామంలో పాఠశాల లేక పోవడంతో విద్యార్థులు రాను పోను సుమారు మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న లక్ష్మీపురం ఎంపిపి పాఠశాలకు కాలినడకన వెళుతున్నారు. కొండ కోనల దాటి విద్యార్థులు చదువుకునేందుకు వెళ్తున్నారు. దీంతో, తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపురం సర్పంచ్ కొర్రా త్రినాధ్ శనివారం మాట్లాడుతూ, ఈ గ్రామాల మధ్య పెద్ద గెడ్డలు, వర్షపు కాలువలలో వరద నీరు అతివేగంగా ప్రవాహిస్తూ ఉంటుందన్నారు. వర్టా కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి చిన్నారులు చదువుకునేందుకు వెళుతున్నారన్నారు.మెట్టగుడలో పాఠశాలను మంజూరు చేయాలని గతంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారికి వినతి పత్రం సమర్పించగా స్పందించి తాత్కాలికంగా ఒక సంవత్సరం పాటు రేకు షెడ్డులో పాఠశాలను నడిపారని, అనంతరం దాన్ని తొలగించారని తెలిపారు.. కొత్త ప్రభుత్వం విద్యార్థుల కష్టాన్ని గుర్తించి మెట్టగూడ గ్రామాంలో పాఠశాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
