గిరిజన విద్యార్థుల మరణాలు అరికట్టాలి

Nov 30,2024 23:42
మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన విద్యార్థుల మరణాల నియంత్రణకు సమగ్ర దర్యాప్తు చేసి, పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పాడేరు సి.పి ఎం కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నో ఆశలతో స్కూల్స్‌కి వెళుతున్న గిరిజన విద్యార్థులు అనేకమంది తరుచుగా మృతి చెందుతుండటంతో తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే సుమారు 10 మంది విద్యార్థులు ఈ ఏడాదిలో మరణించారన్నారు. పౌష్టిక ఆహారాన్ని అందించే చర్యలు సక్రమంగా లేవని, వాటి పర్యవేక్షణ సమర్థవంతంగా లేదన్నారు. చిన్న పాటి జ్వరాలకే గిరిజన విద్యార్దులను మృతి చెందుతున్నారని, రక్తహీనత నివారణకు స్కూల్‌లో అవగాహన కార్యక్రమాలు చెప్పలేదని తెలిపారు. అరకు గురుకుల బాలికల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థిని జన్ని ప్రియాంక అనారోగ్యం బారిన పడటంతో హుటాహుటిన అరకు ప్రాంతీయ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా వైద్యం అందించిన కొద్ది క్షణంలోనే ప్రియాంక చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు చనిపోతున్నా సంబంధిత అధికారులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు స్పందించిన పరిస్థితి కనిపించ లేదని విమర్శించారు. తమ పిల్లలు ఎందుకు మృతి చెందుతున్నారో కూడా తెలియని దుస్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఉన్నారని, కనీసం పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని అప్పగిస్తున్నారన్నారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదని, ఆదుకొనే పరిస్థితి లేదన్నారు. ఆశ్రమ పాఠశాలలో హెల్త్‌ అసిస్టెంట్‌లను నియమిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సి.పిఎం మండల కార్యదర్శి ఎల్‌ సుందరరావు, సీనియర్‌ నాయకుడు పి.లక్కు పాల్గొన్నారు.

➡️