బిజెపి ఎంపీ అభ్యర్థి గీతను ఓడించండి

Apr 4,2024 00:17
మాట్లాడుతున్న సురేంద్ర

ప్రజాశక్తి- అల్లూరి డెస్క్‌:కూటమి బిజెపి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను ఓడించాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర తెలిపారు. బుధవారం అరకులోయ గిరిజన భవనంలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర, అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌, రామన్న, జగన్నాధంతో కలిసి స్థానిక విలేకరులు సమావేశంలో మాట్లాడారు.అదాని హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌, షిరిడి సాయి ఎలక్ట్రికల్‌ బడా పెట్టుబడిదారుల నుంచి లంచాలు తీసుకుని పోటీ చేస్తున్న వైసిపి, బీజేపీ టీడీపీ, జనసేన అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. గిరిజన హక్కులు, చట్టాల అమలుకై పోరాటం చేస్తున్న సిపిఎం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం అభ్యర్థులను గెలిపించి చట్టసభలకు పంపిస్తే ఆదివాసిల గొంతు వినిపిస్తారని తెలిపారు. అటవీ పర్యావరణం చట్టం రద్దు చేసి ఆదివాసి ప్రాంతాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పేందుకు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. పోలవరం నిర్వాసిత ఆదివాసులకు ఇప్పటివరకు న్యాయం చేయలేదన్నారు. ప్రత్యేక హౌదా ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేసిన బిజెపిని ఓడించాలన్నారు. బీజేపిని 400 ఎంపీ సీట్లతో గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని బహిరంగ ప్రకటన చేస్తున్నారని దుయ్యబట్డారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందించాలని, గిరిజన స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ జారీ చేసి, గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్‌ అసిస్టెంట్‌ నియమించాలని డిమాండ్‌ చేశారు.

➡️