ప్రజాశక్తి -అనంతగిరి:ఇవి మట్టి రోడ్డు అనుకుంటే పొరపాటు పడినట్టే. గత 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వ హాయంలో బీటి రోడ్డు నిర్మించారు. రెండవ దపా తారు వేయకపోవడంతో మరమ్మతులకు గురై వర్షాలకారంగా కోతకు గురై గోతులుగా ఏర్పడి మట్టిరోడ్డులా తలపిస్తున్నాయి. ఇదీ కోనాపురం రోడ్డు పరిస్థితి. అనంతగిరి మండలం బొర్రా, కోనాపురం పంచాయతీలతో పాటు అరకు మండలం గన్నేల, లోతెరు, ఇరిగాయి పంచాయతీల ప్రజలు ఈ రోడ్డు మీదుగా ఎస్.కోట, విశాఖ, విజయనగరం ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలకు వెళుతుంటారు.తక్కువ సమయంలో ప్రయాణం కలిసి వస్తుడటంతో ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తుంటారు. బొర్రా గేటువలస మొదలు కొని చప్పాడి, కోనాపురం, కితలంగి అత్తిమాల, కరయిగుడ మీదుగా లోతేరు మెయిన్ రోడ్డు వరకు 15 కిల్లో మీటర్ల పైగా ఉంటుంది. గత కొన్నేళ్ల నుండి గోతులమయంగా ఏర్పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కురిసిన భారీ వర్షాలకు వేసిన తారు కోతకు గురై రోడ్డుంతా మట్టి రోడ్డులా తయారయ్యింది. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కనీసం ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టిన పాపాన పోలేదు. ఎన్ని సార్లు ఆయా గ్రామాల ప్రజలు ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాదుడే కరువుయ్యారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
