ప్రజాశక్తి-అరకులోయ రూరల్:పార్లమెంట్ సమావేశంలో తెలంగాణ బీజెపి ఎంపి డికె అరుణ బోయవాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చాలని వ్యాఖ్యానించడాన్ని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తీవ్రంగా ఖండించారు. బుదవారం అరకులోయ మండల కేంద్రంలోని ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి ఆదివాసీలకు అన్యాయం చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బోయ వాల్మీకులను గిరిజన జాబితలో చేర్చాలని శ్యామల ఆనంద్ కమిషన్ వేసిందనీ, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని అప్పుడు ప్రతిపక్షలో ఉన్న టీడీపి పార్టీ కూడా బోయ వాల్మికీలను గిరిజన జాబితాలో చేర్చాలని ఆమోదించిందని దీన్ని ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకించిందని తెలిపారు. ప్రస్తుతం బోయవాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. బోయవాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చేందుకు ఇప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా గతంలో కారం శివాజీ నాయకత్వంలో కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానించిందన్నారు. బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చేందుకు కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్ర తెలుగుదేశం, ప్రతిపక్ష వైసిపి పార్టీలు ఒకే విధాన ధోరణిలో వెళ్తున్నాయని విమర్శించారు. ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు ఇల్లులు మంజూరు చేయాలని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు ఇల్లులు మంజూరు చేయడమంటే 1/70 చట్టానికి తూట్లు పొడవడమే అవుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులకు ఇల్లులు మంజూరు చేయవద్దని తెలిపారు. 1/70 చట్టం ఉండగా షెడ్యూల్ ప్రాంతంలో గిరిజ నేతరులకు ఇల్లులు ఎలా మంజూరు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 1/70చట్టాన్ని సవరించాలని రాష్ట్ర అసెంబ్లీ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటన వెనక 1/70 చట్టం తొలగింపు కుట్రలో భాగంగానే రంపచోడరం ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా గిరిజనేతరులకు ఇల్లు మంజూరు చేయాలని వ్యాఖ్యానించారని, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియల శిరీష చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో గిరిజనులు పోరాటానికి సన్నద్ధం అవుతారని హెచ్చరించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 1/70 చట్టం రక్షణకు అసెంబ్లీ సమావేశంలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్, మండల నాయకులు కె జగన్నాధం, కె బుజ్జీ బాబు పాల్గొన్నారు.
