ప్రజాశక్తి -అనంతగిరి:గుమ్మ పంచాయతీ కరిగోడ గ్రామాల రోగులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. నెల రోజులు వ్యాధిలోనే ఇద్దరు గర్భిణీలు డోలి సహాయంతో వైద్య సేవల కోసం వెళ్లవలసి వచ్చింది. గత వారం క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్. లచ్చన్నను డోలి సహాయంతో ి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే బడ్నాయిని. కుమారి అనే గిరిజనుడు వాంతులు విరోచనాలతో బాధపడుతుండగా బుధవారం కుటుంబ సభ్యులు స్వగ్రామం నుండి కొండ కోనల అటవీ మార్గం గుండా సుమారు 6 కిలోమీటర్ల డోలి సహాయంతో నిమ్మ ఊట గ్రామానికి తరలించి అక్కడ నుండి ప్రైవేటు ఆటోలో ఎస్. కోట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. సరైన రోడ్డు సౌకర్యం లేక పోవడంతోనే రోగులకు ఈ కష్టాలు రోజు రోజుకు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిన రోడ్డు పనులు ప్రారంభించాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.