ప్రజాశక్తి – ఏలూరు అర్బన్, సిటీ ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు బలపర్చిన పిడిఎఫ్ అభ్యర్థిగా దిడ్ల వీర రాఘవులు (డివి.రాఘవులు) నామినేషన్ కార్యక్రమం భారీ ర్యాలీతో అట్టహాసంగా సాగింది. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ నుండి వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు, కార్మిక, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలొచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ఫైర్ స్టేషన్ మీదుగా కలెక్టరేట్ వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి కె.వెట్రిసెల్వికి అభ్యర్థి డివి.రాఘవులు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం సిఐటియు కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి అధ్యక్షత వహించి మాట్లాడుతూ 2007 నుంచి పిడిఎఫ్ అభ్యర్థులుగా గెలుపొందిన వారు నీతి, నిజాయతీకి నిదర్శనంగా నిలిచారన్నారు. ముఖ్యఅతిథి శాసనమండలిలో పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి కెఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే శక్తి పిడిఎఫ్ అభ్యర్థులకు మాత్రమే ఉందన్నారు. స్వలాభం కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. డివి.రాఘవులు 40 సంవత్సరాలుగా యుటిఎఫ్‌లో వివిధ స్థాయిల్లో పని చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ఎన్నికకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉందని, ఈ 20 రోజులు 24 గంటలు పని చేయాలని కోరారు. కూటమి అభ్యర్థికి రాజకీయ, కుల, ధన, బలాలు ఉన్నాయని, మన పిడిఎఫ్ అభ్యర్థికి ప్రజాబలం, కార్యకర్తల బలం, సంఘాల బలం ఉందని తెలిపారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. డివి.రాఘవులు విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి పాలకులు ప్రజల జీవితాలు ఫణంగా పెట్టి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు చేస్తున్నారని విమర్శించారు. పాలకుల తప్పుడు విధానాలను ప్రశ్నించి ప్రజా సమస్యలను లేవనెత్తి పరిష్కారం కోసం కృషి చేసే రాఘవులును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎంఎల్‌సి బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. శాసనసభలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సమస్యలపై అడిగేవారే లేరని, ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సిఐటియు ఎటువంటి ఉద్యమం చేసినా రాజకీయాలతో సంబంధం లేకుండా పిడిఎఫ్ ఎంఎల్‌సిలు సహకరించేవారని గుర్తు చేశారు. ప్రజాసంఘాల రాష్ట్ర నేతలు మంతెన సీతారాం, బి.బలరాం మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలు అంటే అంటే ఓటర్లు పిడిఎఫ్ అభ్యర్థులకే ఓట్లు వేస్తారని, ప్రస్తుతం ఆ సీటు కోసం సంబంధం లేని వారు పోటీ చేస్తున్నారని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుని రాజకీయ పార్టీలవారు లాక్కోవాలని చూస్తున్నారని అన్నారు. దీన్ని తిప్పికొట్టి పిడిఎఫ్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్, సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు కె.ఉమామహేశ్వరరావు, పి.చంద్రశేఖర్, ఎస్.బాలాజీ, జ్యోతిబసు, శ్రీదేవి, అరుణకుమారి, రవికుమార్, ముస్తఫా ఆలీ, విజయరామరాజు, రామభద్రం, జయకర్, షరీఫ్, నరేష్, డిఎన్‌విడి.ప్రసాద్, ఎ.రవి, ఎస్‌ఎన్.రమేష్, జి.రవికిషోర్, బేబీరాణి, జెఎన్‌వి.గోపాలన్, అరుణ్‌కుమార్, ఐవి.సుధాకర్, కె.రాజారామ్మోహన్‌రారు, ఆర్.లింగరాజు పాల్గొన్నారు.
