కొండదొర తెగను తొలగించడం దుర్మార్గం

కిల్లో సురేంద్ర

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: గ్రామ సచివాలయ ప్రభుత్వా ఏపి-సేవ పోర్టల్‌ నుండి కొండదొర కులస్తులను తొలగించడం దుర్మార్గమని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు. శుక్రవారం అరకులోయ ఆదివాసి గిరిజన సంఘం భవనంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌, మండల అధ్యక్ష కార్యదర్శులు జి.బుజ్జిబాబు, పి.రామన్న, సుంకరమెట్ల సర్పంచ్‌ ఎమ్మెల్యే చినబాబు, బస్‌కి మాజీ ఎంపిటిసి బురిడీ దశరథ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత మూడు నెలల క్రింతమే ప్రభుత్వం కొండదొరలను వెబ్సైట్‌ నుండి తొలగించడంతో కుల ధ్రువీకరణ పత్రం పొందుటకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పోరాటాలు చేయడంతో మళ్లీ పునరుద్ధరణ చేశారని, ఇప్పుడు మళ్లీ తొలగించడం అన్యాయమన్నారు. పాఠశాలల, కళాశాల, ఇతర అవసరాల నిమిత్తం కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడంతో విధ్యార్థులు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్‌లో ఎస్టి కొండదొర తెగను చేర్పించి వెంటనే కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కళాశాలలు, పాఠశాలలో చేరే విద్యార్ధులు కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే సచివాలయ ఏపీ పోర్టల్‌ వెబ్సైట్లో ఎస్టీ కొండ దొర తెగలను పునరుద్ధరణ చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

➡️