జిల్లాలో 35 రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు

జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

ప్రజాశక్తి- పెదబయలు:రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రభుత్వ పథకాలు అందించి ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాలో కొత్తగా మరో 35 రైతు ఉత్పత్తిదారు సంఘాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గలగండ పంచాయతీ సిరసపల్లి గ్రామం వద్ద చిరుధాన్యాలు సేకరణ కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రతి గిరిజన గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పారు. గిరిజన రైతుల అభివృద్ధికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సహకారం అందిస్తాయన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల సహకారంతో రైతులు వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు.కలెక్టరేట్‌ లో స్వచ్ఛంద సంస్థలతో జిల్లా లాభాపేక్ష లేని ఫోరం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఫోరంలో 64 స్వచ్చంద సంస్థలు నమోదు చేసుకున్నాయని చెప్పారు. గిరిజన ఉత్పత్తులపై ఏర్పాటుచేసిన ఫోటో ప్రదర్శనను ఆయన తిలకించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌ .బి.ఎస్‌ నంద్‌ మాట్లాడుతూ, జిల్లాలో చిరుధాన్యాల సాగు పెరగాలన్నారు. చిరుధాన్యాలలో పోషక విలువలు అధికంగా ఉంటాయని చెప్పారు. చిరుధాన్యాలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని అన్నారు.సుసాగు చిరుధాన్య చెల్లెళ్ల సంఘం చైర్‌ పర్సన్‌ ఎం విజయ మాట్లాడుతూ, 250 మంది రైతులతో సంఘం ప్రారంభించచాని, ప్రస్తుతం 1130 మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో చిరుధాన్యాల సాగుపై చైతన్యవంతం చేస్తున్నామని చెప్పారు. అనంతరం కెవికే ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి ఏ. రమేష్‌ కుమార్‌రావు, ప్రకృతి వ్యవసాయం డీపీఎం భాస్కరరావు, కాఫీ బోర్డు అధికారి సుదీప్‌, ఎంపీడీవో పూర్ణయ్య, తహసిల్దార్‌ రంగారావు, ఎంఈఓ పుష్ప జోసెఫ్‌, కెవికె శాస్త్రవేత్త రాజ్‌ కుమార్‌ ఎంపీపీ వరహాలమ్మ, సర్పంచ్‌ లోహిత థాస్‌, సంస్థ సీఈవో టి.శాంతి పాల్గొన్నారు.

➡️