రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

Jan 15,2025 23:54
పాదయాత్ర చేపడుతున్న సిపిఎం నేతలు, గిరిజనులు

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:అరకులోయ మండలం బస్కి పంచాయితీ గిర్లిగూడ నుండి డుబ్రిగుడ మండలం కితలంగి పంచాయితీ పరిశీల గ్రామం వరకు సుమారు నాలుగున్నర కిలోమీటర్‌ వరకు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, దేవరపల్లి క్లస్టర్‌ పీసా కార్యదర్శి స్వాబి పొత్తి డిమాండ్‌ చేశారు. బుదవారం గిర్లిగూడ నుండి పరిశీల వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు వరకు సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు పాదయాత్ర చేపట్టారు. ఈ సంధర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, దేవరపల్లి క్లస్టర్‌ పీసా కార్యదర్శి స్వాబి పొత్తి మాట్లాడుతూ, గర్లిగూడ గుడ నుండి పరిశీల వరకు రోడ్డు సమస్య తీవ్రంగా ఉందని, దీంతో నిత్యం రాకపోకలు సాగించే గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. డుంబ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ పరిశీల గ్రామం దగ్గర బ్రిడ్జి లేక అరకువేలి, అనంతగిరి, హుకుంపేట మండ లానికి చెందిన ఆదివాసి గిరిజనులు పండించిన సరుకులు అమ్మకానికి మార్కెట్‌లో తీసుకు రావాలంటే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. అత్యవసర పరిస్థితిలో వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అంబులెన్స్‌ కుడా వచ్చే పరిస్థితి లేదని, దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారని తెలిపారు. రోడ్డు సౌకర్యం కల్పిస్తే జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లడానికి అనంతగిరి, అరకులోయ మండలానికి చెందిన ప్రజలకు రవాణా కష్టం తీరుతుందని తెలిపారు. తరతరాల నుండి రోడ్డు లేక కాలినడకతో పండించిన పంటలు బరువు మోసి సంతకి తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందించి తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కిలో క్రిష్ణ, శోభ బలరాం, కిలో గోవర్ధన్‌, కిల్లో బాలరాజు, వంతల హరి, కిల్లో డొంబర్దర్‌, కొర్రా రఘునాథ్‌, కిల్లో భగవాన్‌ ( వార్డు మెంబర్‌), స్వాబి ప్రసాదరావు, కొర్రా రాజు, స్వాబి జానీ బాబు, కిల్లో హరి, కిల్లో ఉప్ప, కిల్లో భాను, భాగ్య, మూత్తి, కిల్లో మల్లిక, పాల్గొన్నారు.

➡️