ప్రజాశక్తి-పాడేరు టౌన్: బాలికలు అన్ని రంగాల్లో రాణించి సమాజంలో తగిన గుర్తింపు పొందాలని కాకినాడకు చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు అల్లూరి సురేంద్రరాజు సూచించారు. మండలంలోని కందమామిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినిలకు ప్రముఖ యోగ గురువు పతాంజలి శ్రీనివాస ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రేరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో బాలికలకు చదువు చాలా ముఖ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించి నడుచుకోవాలని చెప్పారు. తల్లిదండ్రుల తరువాత స్థానంలో విద్యను నేర్పే గురువులన్నారు. సమావేశ అనంతరం యోగ గురువు శ్రీనివాస్ విద్యార్థినిలతో పున్ణశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫణీంద్ర, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
