గురుకుల అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లను రెగ్యులర్‌ చేయాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-పాడేరు: గిరిజన సంక్షేమ గురుకుల విద్యా రంగంలో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లను రెగ్యులర్‌ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పాడేరు ఐటిడిఏ ఎదుట గురుకుల అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లు 19 రోజులుగా నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. దీక్షలకు మద్దతు తెలిపారు. చాలా ఏళ్లుగా గురుకుల పాఠశాలల్లో ఉన్న ఖాళీ టీచర్‌ పోస్టుల్లో నియమించబడిన ఈ అవుట్‌ సోర్సింగ్‌ గిరిజన టీచర్లను మెగా డీఎస్సీ పేరుతో బయటకు పంపించే నిర్ణయం దుర్మార్గమన్నారు. ఇన్నేళ్లు తక్కువ వేతనాలతో ప్రభుత్వానికి సేవ చేశారని తెలిపారు. అవుట్సోర్సింగ్‌ పై పని చేస్తున్న ఈ టీచర్లను కాంటాక్ట్‌ గా గుర్తించి రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో అర్హులైన గిరిజనులు అవుట్సోర్సింగ్‌, కాంట్రాక్టు పై పని చేస్తుంటే గిరిజనేతరులు రెగ్యులర్‌ ప్రాతిపదికన పని చేస్తున్నారని, ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ టీచర్ల కడుపు కొడితే సహించబోమని హెచ్చరించారు. యువత జీవితాలతో చెలగాటమాడడం సరికాదని అధికారులు, మంత్రులు మంచి ఆలోచన చేసి అవుట్సోర్సింగ్‌ పై ఇన్నేళ్లుగా సేవలు అందిస్తున్న వీరందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ద్రోహం తలపెడితే ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధం కావాలని ఔట్సోర్సింగ్‌ టీచర్లకు పిలుపునిచ్చారు. ఇందుకు పూర్తిగా తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అవుట్సోర్సింగ్‌ టీచర్లు వారి సమస్యలపై వినతిపత్రం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాథం, అప్పలనరస, కిల్లో సురేంద్ర పాల్గొన్నారు.

➡️