సాగు భూముల జోలికొస్తే తరిమి కొడతాం

నినాదాలు చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి -అనంతగిరి:జీవన ఆధారమైన తమ సాగు భూములలో ప్రవేటు ఏకొ టూరిజం ఏర్పాటును అడ్డుకుంటామని సీపీఎం ఆద్వర్యాన గిరిజనులు సాగు భూమి వద్ద ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీంపోలు పంచాయతీ సీపీఎం నాయకులు జేష్ట .వెంకటరమణ మాట్లాడుతూ, నందకోట రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.22-28 లో సాగులో ఉన్న రైతులకు ప్రభుత్వం డీ పట్టా మంజూరు చేసీందన్నారు. ఆ భూమి లో రైతులు జీడి, టేకు మొక్కలు నాటి ఫలసాయం పొందడమే కాకుండా వ్యవసాయ పంటలు పండించుకుంటు జీవనం సాగిస్తున్నారన్నారు. ఇదే భూమిలో గతంలో కూడా కొంతమంది ఏకొ టూరిజం ఏర్పాటుకు ప్రయత్నిస్తే పోరాటం ద్వారా అడ్డుకున్నామని తెలిపారు. విజయనగరానికి చెందిన ఓ భూస్వామికి ప్రైవేటు టూరిజం పేరుతో రైతుల సాగు భూమి కట్టబెబ్టేందుకు ప్రభుత్వం, కొంతమంది పెద్దలు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇందుకే శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా జేసి, పాడేరు సబ్‌ కలెక్టర్‌ పర్యటించి పరిశీలించారన్నారు. గత ప్రభుత్వం కూడా రమేష్‌ అనే భూస్వామికి ఈ భూమి అప్పజెప్పాలని ప్రయత్నం చేసినపుడు రైతులతో కలిసి పోరాటం చేశామని గుర్తు చేశారు. నది పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి కట్టడాలు చేయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలతో లాభియింగ్‌ చేసి అక్రమంగా భూములు కొట్టేయడానికి రమేష్‌ చూస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేటు టూరిజం పేరుతో తమ సాగు భూములు ఇచ్చే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాగు రైతులు మూతిబోయిన. సింహాచలం, ఊడికి. సన్యాసి దేముడు, గొండ రాము, వనెపూరి. కన్నయ, వనెపూరి ఈశ్వరమ్మ, ఊడికి .సింహాచలం, మామిడి జగన్నాథరావు, జన్ని క్రిష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️