వైభవంగా మోదకొండమ్మ ఉత్సవాలు

Jun 9,2024 23:56 #Modakondamma, #paderu festival
ఉత్సవాల్లో ఆకట్టుకున్న కళారూపాలు

ప్రజాశక్తి-పాడేరు:

అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం ఉదయం మోదకొండమ్మ అమ్మవారి జాతర మహౌత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న అమ్మవారి జాతరలో భాగంగా ఆదివారం జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌, ఆలయ కమిటి అధ్యక్షురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అమ్మవారి ఆలయం నుండి శతకం పట్టు వరకు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను ఘటాలను శతకం పట్టుకు డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాలు, గరగల డాన్సులతో ఊరేగించారు. శతకం పట్టు వద్ద ప్రతిష్టించారు. భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరి ఆలయం వద్ద సతకం పట్టు వద్ద కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకున్నారు. కొలువు ఉత్సవంలో భారీ ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఘటాల ఊరేగింపు కన్నుల పండవగా సాగింది. శతకంపట్టు వద్ద జిల్లా కలెక్టర్‌, ఐటిడిఏ పిఓ, సబ్‌ కలెక్టర్‌ బాణా సంచాలు కాల్చారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత విలేఖరులతో మాట్లాడుతూ, ఈనెల 9,10,11 తేదీలలో మూడు రోజుల పాటు జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. గిరిజన ఆరాధ్యదైవం దర్శనానికి వివిద ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసారని చెప్పారు. పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్సీ ధీరజ్‌, పాడేరు మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి, ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం ప్రారంభమైన మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలలో భాగంగా సాయంత్రం నిర్వహించిన సాంస్కతిక ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి… ఆదివారం సాయంత్రం శతకం పట్టు నుంచి పురవీధుల్లో అమ్మవారి ఘటాలను ఊరేగించారు ఈ సందర్భంగా పలు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.. చిత్ర విచిత్రమైన నృత్య ప్రదర్శనలతోనూ డప్పు వాయిద్యాలతో అమ్మవారి సంబరం ఘనంగా జరిగింది. కేరళ తరహా బ్యాండ్‌ మేళాలు డప్పుల డాన్సులతోపాటు అమ్మవార్ల వేషాలలో నృత్య ప్రదర్శన, అమ్మవారికి ప్రీతి పాత్రమైన గరగల నృత్యాలు పురవీధుల్లో ప్రదర్శించారు. జూనియర్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన జైంట్‌ వీల్స్‌ పలు యంత్ర ప్రదర్శనలు గ్లోబ్‌లో మోటార్‌ సైకిల్‌ కార్లు రేసింగ్‌ అబ్బుర పరిచాయి.జాతరలో వైద్య శిబిరం ఏర్పాటు పాడేరులో మోదకొండమ్మ జాతర మహౌత్సవాలను పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. వైద్య శిబిరానికి హాజరైన 219 మంది రోగులకు దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డీకే హిమబిందు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ, జాతరలో ప్రజలు ప్రత్యేక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. జాతరలో విక్రయించే నిలువ ఆహారాన్ని, నిలవ పానీయాలను స్వీకరించరాదని ఆమె తెలిపారు. దీంతో ఉదర సంబంధమైన రోగాలు వ్యాప్తి చెందుతాయని ు తెలిపారు. ప్రస్తుతం ఎపెడమిక్‌ సీజన్‌ కావడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యాధుల భారిన పడకుండా ఉండాలన్నారు. జ్వరాలు వస్తే వెంటనే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వెళ్లి మెరుగైన చికిత్స పొందాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఆమె తెలిపారు. జాతరలో నిర్వహించే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.

➡️