ప్రజాశక్తి -సీలేరు: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పగడ్బందీ చర్యలు చేపడుతున్నామని డిఇఒ బ్రహ్మాజీరావు అన్నారు. ఆదివారం సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని టెన్త్ పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లుపై పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, జిల్లాలో 71 పరీక్ష కేంద్రాలో 258 హైస్కూళ్లకు చెందిన 11760 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఇప్పటికే పోలీస్‌స్టేషన్లకు ప్రశ్నాపత్రాలు చేరుకున్నాయన్నారు. కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ఇతర శాఖలకు చెందిన అధికారులను అన్ని పరీక్ష కేంద్రాల్లో సిటింగ్ స్వ్కాడ్‌లుగా ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సిసి కెమరాలను పాడేరు ఐటిడిఎలో ఏర్పాటు చేసిన మోనటరింగ్ విభాగానికి అనుసంధానం చేసి, అన్ని కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్న తీరుపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. అల్లూరి జిల్లాకు నాలుగు ఫ్లయింగ్ స్వ్కాడ్‌లకు అనుమతిరాగా, మరో నాలుగు అదనపు బృందాలను ఏర్పాటుచేసి, పటిష్ట నిఘా, పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. నిధుల కొరతతో జిల్లాలోని పలు పాఠశాలల భవన నిర్మాణాలు నిలిచిపోయాయని, ఇటీవల రూ.పది కోట్ల నిధులు మంజూరైన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు చేపట్టి పూర్తిచేస్తామన్నారు. జిల్లాలో మరొక 460 పాఠశాలలకు భవనాలు అవసరమని గుర్తించి, కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు.కార్యక్రమంలో హెచ్‌ఎం నాగభూషణం, ఉపాధ్యాయులు దామోదర్ వెంకటరత్నం పాల్గొన్నారు
సీలేరు పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న డిఇఒ