మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ కాపీలు దగ్ధం

Apr 28,2025 00:18
పాడేరులో ఆందోళన చేపడుతున్న స్పెషన్‌ డిఎస్‌సి సాధన కమిటీ సభ్యులు

ప్రజాశక్తి -పాడేరు :- ఆదివాసి ప్రాంతంలో తక్షణమే స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ, ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జీవో కాపీలను ఆదివారం స్థానిక పీఎంఆర్సి వద్ద సాధన కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. స్పెషల్‌ డిఎస్సీ సాధన కమిటీ చేపట్టిన దశల వారి ఉద్యమంలో భాగంగా ఆదివారం పలు మండలాల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కాపీలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆదివాసి స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ విడుదల కోసం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సాధన కమిటీ సభ్యులు, నిరుద్యోగ గిరిజన యువత ఈ సందర్భంగా నినాదాలు చేశారు. స్పెషల్‌ డిఎస్సి కోసం మే2న నిర్వహిస్తున్న మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ సాధన కమిటీ నేతలు మాట్లాడుతూ: సిఎం నారా చంద్రబాబు నాయుడు అరకు పర్యటనలో ఇచ్చిన ఎన్నికల హామీని తక్షణమే నిలబెట్టుకోవాలన్నారు. ఆదివాసి ప్రాంతంలో నూటికి 100శాతం ఉద్యోగాలు ఆదివాసులకే ఇచ్చేలా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ నెల 30వ తేదీలోపు ఆదివాసులకు స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ ప్రభుత్వం విడుదల చేయకపోతే మే రెండవ తేదీ నుంచి నిరవధిక బంధ్‌ చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిఎస్సి సాధన కమిటీ నాయకులు కూడ రాధాకృష్ణ, వంతాల నాగేశ్వరరావు, భాను, వి ప్రతాప్‌, జె.కుమారస్వామి, సిహెచ్‌ మహేష్‌, పి.చిరంజీవి, డి.మోహన్‌, పిట్ట నరేష్‌, ఆర్‌.ప్రశాంత్‌ కుమార్‌, మత్యలింగం, ఆదివాసి స్పెషల్‌ డిఎస్సీ సాధన కమిటీ సలహాదారులు, నాయకులు నూకరాజు, సలీం, చిరంజీవి, శంకర్‌, రంజిత్‌ కుమార్‌, శ్యాంసుందర్‌, బాలకృష్ణ పాల్గొన్నారు.హుకుంపేట: స్పెషల్‌ డీఎస్సీ సాధన కమిటీ పిలుపు మేరకు ఓల్డా, గూడ గ్రామాలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు పి సురేష్‌, ఎస్‌ రాధాకృష్ణ మాట్లాడుతూ, ఆదివాసులకు స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేసన్‌ తక్షణమే విడుదల చేయాలని, జిఒ 3 కు ప్రత్నామ్నాయంగా జిఓ విడుదల చేయాలని తెలిపారు.ఆదివాసులకు వందకు వందశాతం ఉద్యోగ రిజర్వేషన్‌ నియామక చట్టం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి నరేష్‌, రాధాకృష్ణ, గణేష్‌, కేబీ ప్రసాద్‌, ఎస్‌ సత్యనారాయణ, ఎస్‌.భూషణం, ఎస్‌.సూరిబాబు, ఎస్‌.గిరి, బి కాంతిరాజు, విశ్వేష్‌, శ్రీను, ఈశ్వరి, ఎస్‌ ఝాన్సీ, రజిత, నిరుద్యోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️