కింజేరులో మెగా వైద్య శిబిరం

పరీక్షలు చేస్తున్న వైద్యాధికారి

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలోని రంగిలిసింగి పంచాయతీ కింజేరు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కింజేరు, కూడబీర్‌, రంగిలిసింగి, కుజబంగి గ్రామాలతో పాటు గుంటసీమ, గుంటగన్నేల పంచాయతీ పలు గ్రామాల నుంచి జలుబు ,దగ్గు, తలనొప్పి, జ్వరం, చర్మ వ్యాధులుతోపాటు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న సుమారు 200 మంది గిరిజనులు శిబిరంలో పాల్గొని వైద్య సేవలు చేయించుకున్నారు. వీరికి స్థానిక డుంబ్రిగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి పిరాంబాబు వైద్య సేవలు అందించి మందులను పంపిణీ చేశారు. అనంతరం వైద్యాధికారి మాట్లాడుతూ, ప్రస్తుత వర్షాకాల వాతావరణంలో జలుబు, దగ్గు, జ్వరంతో పాటు టైఫాయిడ్‌, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, ప్రతిరోజు కాచి చల్లార్చిన వేడి నీటిని ఉపయోగించాలని కోరారు. పశువుల శాలలను కూడా శుభ్రపరుస్తూ ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.సూర్యనారాయణ, మండల నాయకుడు పి.దొంబు పాల్గొన్నారు.

➡️