ప్రజాశక్తి -అరకులోయ రూరల్:అరుకు కేకే లైన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు.ఈ మేరకు గురువారం యూనియన్ ఆధ్వర్యంలో అరకులోయలోని ఆదివాసి గిరిజన సంఘం భవనంలో ఉద్యోగ భద్రత, జీవో ప్రకారం కనీస వేతనం అమలు వంటి అంశాలపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు కు ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహులు హాజరై ప్రసంగించారు.అరుకు కేకే లైన్లో ట్రాక్మెన్ వర్కర్స్, శానిటేషన్, రన్నింగ్ రూమ్, గెస్ట్ హౌస్ లో సుమారు 200 మంది పనిచేస్తున్నారని, వీరంతా వెనకబడిన గిరిజనులేనని తెలిపారు. వీరికి కనీస వేతనాలు ఇతర పిఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు అమలు కాలేదని తెలిపారు. తక్షణం కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన రాయితీలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే ను ప్రైవేటుకరించాలని చూస్తోందని, దీనిలో భాగంగానే రైల్వే స్టేషన్‌ను ఆధునికరించి కార్పొరేట్లకు అప్పచెప్పాలని ప్రయత్నిస్తుందన్నారు. ప్రైవేటీకరణ జరిగితే కాంట్రాక్ట్ కార్మికులకు, పర్మినెంట్ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత ఉండదని తెలిపారు.కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని చూస్తుందని తెలిపారు.ఈ నాలుగు లేబర్ కోడ్స్‌తో కార్మికులకు ఎటువంటి ఉద్యోగ భద్రత, కనీస వేతన చట్టం, సామాజిక భద్రత ఉండదని తెలిపారు.ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిట్టిబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గిరిజన హక్కులు, చట్టాలు లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. జీవో 3 ఇప్పటికే కనుమరుగైందని దీంతో నిరుద్యోగులు దిక్కులేని పరిస్థితి అయిందని అన్నారు. 1/70 చట్టాన్ని చాప కింద నీరులా తొలగించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు.సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వర మాట్లాడుతూ, భవిష్యత్తులో రైల్వే ప్రైవేటీకరణ, కార్మికులు ఉద్యోగ భద్రత కనీస వేతనం చట్టాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సన్యాసిరావు, మహేష్, త్రినాధ్, బోరయ్య, కృష్ణ, బొడ్డవరం, ఎస్ కోట, మల్లి వీడు, బుర్ర, సిమిలిగూడ, కరకవలస, చిముడుపల్లి, అరకు తైడ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.