మోదకొండమ్మ ఉత్సవాలు

పాడేరులో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్‌ సెట్టింగ్‌

ప్రజాశక్తి-పాడేరు: కేంద్రం పాడేరులో ఈనెల 9న ఆదివారం నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక జాతర మహౌత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. పాడేరులో జరిగే ఈ జాతరకు ఏజెన్సీ నలుమూలల నుంచి వేలాది గా గిరిజనులు తరలివస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాదిగా తరలివస్తున్న జన జాతరగా మోద కొండమ్మ ఉత్సవం ప్రసిద్ధి కెక్కడంతో 2016 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గిరిజన ఉత్సవంగా గుర్తించింది. సుమారు కోటి రూపాయలు వరకు నిధులు కేటాయిస్తుండటంతో అమ్మవారి ఉత్సవం భారీ ఏర్పాట్లతో సాగుతోంది. ఈ జాతరలో భాగంగా తొలిరోజు ఆదివారం వేకువ జామున అమ్మవారి ఉత్సవ మూర్తిని, పాదాలను ఆలయం నుంచి భక్తులు అధికారులు, ప్రజాప్రతినిధులు ఊరేగించి గ్రామంలో ప్రత్యేకంగా రూపొందించే శతకంపట్టులో ప్రతిష్టించి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ కొలువు ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. శతకం పట్టు వద్ద అమ్మవారిని కొలువు తీర్చిన తర్వాత గ్రామంలో ప్రతి ఇంటా భక్తులు అమ్మవారి ఘటాలను ప్రతిష్టించుకుని పూజలు చేస్తారు. ఆది, సోమ రెండు రోజులపాటు అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి జాతరకు తరలివచ్చి ఆలయంలోనూ, సతకం పట్టు వద్ద మోదకొండమ్మను దర్శించుకుంటాకుంటారు,.. శతకం పట్టులో కొలువు తీరేే అమ్మవారి ఉత్సవ మూర్తిని, పాదాలను, అమ్మవారి ఘటాలను ప్రత్యేక రీతిలో పెద్ద ఎత్తున నేల వేషాలు సాంస్కతిక ప్రదర్శనలతో భారీ ఊరేగింపుగా అమ్మవారి అనుపోత్సవాన్ని ఈ నెల 11న మంగళవారం నిర్వహిస్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి,సుమారు ఐదారు గంటలసేపు ఈ ఊరేగింపు పురవీధుల్లో సాగుతుంది. ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ తరఫున చైర్మన్‌ కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి సింహచలం నాయుడు, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు టీ.నర్సింగ్‌ రావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొట్టగుల్లి రామారావు, తమరభ ప్రసాద్‌ నాయుడు, వై.శ్రీనివాస్‌, వెంకటరమణ ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్‌ విజయ సునీత, ఎస్పీ తుహిన్‌ సిన్హా పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ఉత్సవాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై చర్యలు తీసుకున్నారు. పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరకు పెద్దఎత్తున వినోదాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. పూలతో ప్రత్యేక అలంకరణ మెయిన్‌ రోడ్‌ లోని శతకం పట్టు ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. పట్టణంలో విద్యుత్‌ దీపాలంకరణ నిర్వహించారు.. మోదకొండమ్మ ఉత్సవాలతో పాడేరు లో సందడి నెలకొంది.

➡️