ప్రజాశక్తి – చింతపల్లి : అధికారమే లక్ష్యంగా అమలు సాధ్యం కానీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానాలపై 100 రోజులలోనే ప్రజలు విసుగెత్తి ఉన్నారని పాడేరు మాజీ శాసన సభ్యురాలు, వైకాపా ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం చింతపల్లి వచ్చిన ఆమె స్థానిక ఎంపీపీ కోరాబు అనూష దేవితో కలిసి మాట్లాడుతూ, మతోన్మాద బిజెపితో జతకట్టిన జనసేన, తెలుగుదేశం పార్టీల కుయుక్తులను రాష్ట్ర ప్రజలు కేవలం 100 రోజులలోనే తెలుసుకున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలను వంద రోజులలోనే అమలు పరుస్తామని చెప్పిన తెదేపా అధికారంలోకి వచ్చి కేవలం పెన్షన్ పెంపు తప్ప మిగిలిన హామీలను విస్మరించారన్నారు. అర్హత లేని వారికి పెన్షన్ తొలగిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పడాన్ని ఆమె తప్పు పట్టారు. ఆనాడు అర్హత ఉండి పెన్షన్ పొందలేని ఎంతోమందికి సదరం ధ్రువీకరణ పత్రాలు అందించి అర్హత కల్పించి పెన్షన్ అందించడం జరిగిందన్నారు.అర్హత లేని వారికి పెన్షన్ తొలగిస్తామని చెప్పడంలో ఈ ప్రభుత్వ ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం తుపాను సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి ఆ దిశగా ఆలోచన చేయ లేదన్నారు. వాలంటీర్లుగా పనిచేసిన వారందరికీ నేడు దిశా నిర్దేశం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ధర్నా చేస్తామన్న ప్రతిసారి వాలంటీర్ల కోసం ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు చిందాడ జయలక్ష్మి, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి పాల్గొన్నారు.