కాఫీ, మిరియాల దిగుబడులకు ప్రణాళిక

కాఫీ రైతులతో మాట్లాడుతున్న కన్నబాబు

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో గిరిజన రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్న కాఫీ, మిరియాల దిగుబడులు పెంచడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి కె..కన్నబాబు తెలిపారు. శనివారం మోదపల్లి గ్రామ వద్ద కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీ రైతు కొర్ర వెంకటరావుతో మాట్లాడి కాఫీ, మిరియాలు సాగు పై ఏడాదికి వస్తున్న ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్గానిక్‌ పద్ధతులతో సాగు చేస్తున్న అరుకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి లభించిందని చెప్పారు. కాఫీ రైతులు బేబీ పల్పర్లు, ట్రసర్లు, టార్పాలిన్లు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కాఫీ రైతులకు అవసరమైన తోడ్పాటును అందించి తద్వారా కాఫీ దిగుబడి నాణ్యత పెంపొందించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. అనంతరం కందమామిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో చర్మవ్యాధుల వైద్య శిబిరాన్ని సందర్శించారు. చర్మవ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు సబ్బులు, మందులు పంపిణీ చేశారు. 9వ తరగతి క్లాస్‌ రూమ్‌లో సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. మరుగుదొడ్లను వంటగదిని పరిశీలించారు. అనంతరం పాడేరు వి.డి.వి. కె. కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌, ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి వి.ఎస్‌ ప్రభాకర్‌, పీహెచ్‌ఓ ఎన్‌.అశోక్‌, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ డివిఆర్‌ఎం రాజు, డిఆర్డిఏ పిడి మురళి, ఏఈ దుర్గాప్రసాద్‌, కాఫీ బోర్డు డిడి ఎస్‌.రమేష్‌, గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి డిడి ఎల్‌.రజిని, కాఫీ ఏఈఓ అప్పలనాయుడు పాల్గొన్నారు.

➡️