ప్రజాశక్తి- పెదబయలు:జిఒ 3 కు చట్టబద్ధత కల్పించిన తర్వాత మెగా డీఎస్సీ ప్రకటించాలని, అలాగే ఇతర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సురేంద్ర, జిల్లా కార్యదర్శి అప్పలనర్స డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ 7వ మహాసభ సీనియర్ నాయకుడు కిలో శరబన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిఎస్సీ నోటిఫికేషన్‌కు ముందే ఆదివాసీలకు నూరు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసారు.ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ ద్వారానే ఏజెన్సీలో టీచర్ పోస్ట్లుల భర్తీ చేయాలన్నారు. డిసెంబర్ 2 నుండి 5 వరకు జరిగే సి.పి.ఎం పార్టీ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. జనరల్ డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ఆదివాసి నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ఆదివాసీ చట్టాల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధి గా పని చేయాలన్నారు. నూరు శాతం రిజర్వేషన్ కల్పనకు అధికారం లోకి వచ్చిన వెంటనే చేపడతామని అరకు ఎన్నికల సభలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. జిఓ 3 రిజర్వేషన్ సాధనకు ఆదివాసీలు పోరాటం చేస్తూన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికే కే,జీ,బీ,వీ, ఏకలవ్య గిరిజన గురుకుల విద్యా సంస్థలో ఇతర టీచర్స్‌తో పోస్టుల భర్తీ చేయడంతో ఆదివాసి నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఆదివాసి రిజర్వేషన్ సాధనకు సిపిఎం పోరాటం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి సన్నిబాబు, మండల కమిటీ సభ్యులు గంగాధరం, శర్బన్న, బుజ్జిబాబు, నరసయ్య, సునీల్, రామారావు పాల్గొన్నారు.