ప్రజాశక్తి -పాడేరు: ఐక్యతతో ఉద్యమాన్ని సాగించి ఉద్యోగ భద్రతను సాధించాలని పిడిఎఫ్ బలపరిచిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కె విజయ గౌరీ పిలుపునిచ్చారు. స్థానిక ఐటిడిఏ ఎదుట గురుకుల ఔట్సోర్సింగ్ టీచర్లు నిర్వహిస్తున్న రిలే దీక్షలు బుధవారం 12వ రోజు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరాన్ని విజయ గౌరీ సందర్శించి ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 12 రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ టీచర్లు ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. గత 15 ఏళ్లుగా విద్యా రంగంలో అన్ని శాంక్షన్ పోస్టుల్లో సీఆర్టీలు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల పని చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వీరిని శ్రమ దోపిడీకి గురి చేస్తోందని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా స్పందించ లేదన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులనే అమలు పరచలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆమె విమర్శించారు. ఉద్యోగాలు సాగించే వరకు పోరాటం కొనసాగించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి మహేశ్వరరావు, వివిధ మండలాల గురుకుల ఔట్సోర్సింగ్ టీచర్లు పాల్గొన్నారు….