ప్రజాశక్తి -పాడేరు: స్వయం సహాయక సంఘాల లో సభ్యులుగా ఉన్న గిరిజన కాఫీ రైతులకు ప్రధాన మంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం (పి. ఎం.ఎఫ్.ఎం.ఇ) లో భాగంగా కాఫీ ఉప కరణాలు మంజూరు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ఐటిడిఏ పి.ఓ. వి.అభిషేక్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో కాఫీ బోర్డు అధికారులు, ఐటిడిఏ కాఫీ విభాగం, డి.ఆర్.డి. ఏ, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన కాఫీ రైతులకు కాఫీ ప్రొసెసింగ్కు అవసరమైన కల్లాలు, బేబీ పల్పర్లు, అల్యూమినియం నిచ్చెనలు, టార్పాలిన్లు ఒక్క యూనిట్ కింద 35 శాతం రాయితీపై లబ్దిదారులకు అందిస్తామన్నారు. కల్లం రూ.55 వేలు (50 శాతం కాఫీ బోర్డు సబ్సిడీ), బేబీ పల్పలర్లు రూ.42 వేలు (50 శాతం కాఫీ బోర్డు సబ్సిడీ), అల్యూమినియం నిచ్చెన రూ.15 వేలు, టార్పాలిన్ రూ. 5 వేలు రాయితీపై అందిస్తామని చెప్పారు. ఈ పథకానికి మొత్తం .1 లక్ష 17 వేలు వ్యయం అవుతోందన్నారు. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుండి రుణం అందిస్తారని చెప్పారు. లబ్దిదారులకు రుణాలు అందించడానికి బ్యాంకులు సహాకారం అందించాలని కోరారు.ఈ సమావేశంలో ఐటిడి ఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వేంకటేశ్వరరావు, కాఫీ బోర్డు డి.డి. ఎస్.రమేష్, కాఫీ సహాయక సంచాలకులు ఎన్.అశోక్, డి.ఆర్.డి.ఏ పి.డి. వి.మురళి, యూనియన్ బ్యాంకు మేనేజర్ ఎల్. భాను చందర్, ఫీల్డు అధికారి ఎస్.రఘు కుమార్ పాల్గొన్నారు. పెట్టుబడి సహాయం అందిస్తాంహుకుంపేట: వన్ దన్ వికాస కేంద్రాల ఉత్పత్తులకు పెట్టుబడి సహాయం అందిస్తామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ అన్నారు. బుధవారం హుకుంపేట మండలం భీమవరం వన్ దన్ వికాస్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వి డి వి కే కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న చీపుర్ల తయారీని పరిశీలించారు. స్పెన్సర్స్, బిగ్ బజార్ వంటి పెద్ద మాల్స్ లో చీపుర్లను విక్రయించే విధంగా నాణ్యమైన చీపురులను తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నాణ్యమైన చీపుర్లను తయారుచేసి అధిక ధరలకు విక్రయించి తగిన లాభాలను పొందాలని పేర్కొన్నారు. విడివికే లకు అవసరమైన పనిముట్లను సమకూరుస్తామని చెప్పారు. హాత్ బజార్లలో గిరిజన ఉత్పత్తులు విక్రయించడానికి ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి వి.మురళి, ఏరియా కోఆర్డినేటర్ రత్నకుమారి, ఏపీఎం అప్పయమ్మ పాల్గొన్నారు.