ప్రజాశక్తి-హుకుంపేట:గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు పెట్టుబడులు పెట్టేందుకు 1/70 చట్టం ఆటంకంగా ఉందని, గిరిజన చట్టాలను సడలించాలని స్పీకర్ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై మండల కేంద్రంలో అఖిలపక్షం పార్టీలు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ చేపట్టి వారపు సంతలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా అఖిలపక్షం నాయకులు, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు తాపుల కృష్ణారావు మాట్లాడుతూ, ఏజెన్సీ లో 1/70 చట్టం సవరణ చేస్తే పెట్టుబడులు వస్తాయని..స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏజెన్సీ లో టూరిజం ద్వారానే అభివృద్ధి జరుగుతుందనే తప్పుడు మాటలు మాను కోవాలన్నారు. 1/70చట్టం సవరణ చేసి ఏజెన్సీ అడవుల్లో బాక్సైట్, లేటరైట్, మైకా, వజ్రాలు వంటి ఖనిజాలు, బహుళజాతి కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన ఈ మాటల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారనే అనుమానం కలుగుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో టీడీపీ కూటమి నాయకులు వెంటనే స్పందించి 1/70 చట్టం రక్షణకు పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీ, సీపీఎం నేత సూడిపల్లి కొండలరావు, సీపీఐ నేత, గిరిజన సమైక్య నాయకులు రాధాకృష్ణ, కాంగ్రెస్ జిల్లా నాయకులు పాచిపెంట చిన్న స్వామి, మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నేతల పెనుమల కాంతి రాజు, వైసీపీ నాయకులు, సురేష్ కుమార్, జిల్లా రైతు విభాగం మాజీ నాయకులు విశ్వేశ్వర రావు, జిల్లా నాయకులు గండేరు చిన సత్యం, సర్పంచ్ పెనుమల రంజీత్ కుమార్, సీపీఎం మండల కార్యదర్శి, మాజీ సర్పంచ్ వలసనైని లక్ష్మణ్ రావు, గిరిజన సంఘం మండల నాయకులు తడిగిరి, కొంతిలి వైస్ సర్పంచ్‌లు కిల్లో రామారావు, కృష్ణ మూర్తి, నాయకులు కొర్ర అప్పారావు, ఆదివాసీ సేన అరకు అధ్యక్షుడు చుంచు రాజు బాబు పాల్గొన్నారు.
