నిరసనలు

పాడేరులో నిరసన చేపడుతున్న కార్మిక, రైతు సంఘాల నాయకులు, కార్మికులు, మహిళలు

ప్రజాశక్తి -పాడేరు: దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాలు సంయుక్తంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక ఐటీడీఏ నుంచి రైతు కార్మిక సంఘాలు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వెళ్లి ధర్నా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఏఐ టియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఆదివాసి కాఫీ రైతు సంఘం జాతీయ నాయకులు జి.చినబాబు మాట్లాడుతూ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు, రైతులు పట్ల పాత విధానాలే అవలంబిస్తూ తీవ్రమైన ద్రోహం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ, రైతులకు గిట్టుబాటు ధర వంటి అంశాలు తీవ్రంగా పట్టిపీడిస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంతంలో కాఫీ రైతులు పండిస్తున్న పంటలకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వలేదని, ప్రోత్సాహక నిధులు కోట్ల రూపాయల బకాయిలు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న స్కీం వర్కర్లను రెగ్యులర్‌ చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఐటిడిఏ పరిధిలో పని చేస్తున్న డైలీ వేజ్‌ కార్మికులకు కలెక్టర్‌ గెజిట్‌ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, కేంద్రం ప్రకటించిన కనీస వేతన చట్ట ప్రకారం రూ.26000 వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమ హాస్టల్స్‌, గురుకులాల్లో పని చేస్తున్న టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు పది వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కాఫీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు పి.లక్కు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సుందర్రావు, గ్రామ వాలంటీర్లు యూనియన్‌ నాయకులు సురేష్‌, ఏఐటియుసి జిల్లా కన్వీనర్‌ అమర్‌, రాజబాబు, ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు అన్నపూర్ణ, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు దాసమ్మ, పద్మ, తదితరులు పాల్గొన్నారు…. రంపచోడవరం :కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యాన మంగళవారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయం నుండి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. రంపచోడవరం ఐటీడీఏ వద్ద ధర్నా నిర్వహించి ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్‌ కలెక్టర్‌ కల్పశ్రీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు కె.శాంతిరాజు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి నిర్మల, జిల్లా కోశాధికారి కె.రామలక్ష్మి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, స్కీమ్‌ వర్కర్స్‌కు జీతాలు పెంచాలని, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని, అధిక ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈ.సిరిమల్లిరెడ్డి, సిఐటియు యూనియన్‌ నాయకులు కొమరం చెల్లయమ్మ, కే.మంగాయమ్మ, కే.రమణమ్మ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

➡️